వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు
కాళ్ల: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాకతో కూటమి ప్రభుత్వం దిగివస్తుందని, తద్వారా ఆక్వా రైతులకు న్యాయం జరుగుతుందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు, మాజీ మంత్రి పేర్ని నాని ధీమా వ్యక్తం చేశారు. మండలంలోని పెదఅమిరం పార్టీ కార్యాలయంలో ఆదివారం ఉండి నియోజకవర్గ ఇన్‌చార్జి పీవీఎల్ నరసింహరాజు ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా హాజరైన పేర్ని నాని, ప్రసాదరాజు మాట్లాడుతూ.. ప్ర స్తుతం ఆక్వా రంగంలో నెలకొన్న సంక్షోభానికి వా తావరణం కారణం కాదని, చంద్రబాబు ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలేనని ఆరోపించారు. అవినీతికి కులం లేదని, అన్ని కులాల ఆక్వా రైతులకు కూటమి ప్రభుత్వం అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. గతంలో జగన్ హయాంలో జె–టాక్స్ అంటూ విషప్రచారం చేసిన వారు, నేడు చంద్రబాబుకు ఏ టాక్స్ కడుతున్నారో రైతులు ప్రశ్నించాలన్నారు. మేతల కంపెనీలు, ఎక్స్‌పోర్టర్ల యాజమాన్యాలతో చంద్రబాబు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని రైతుల కడుపు కొడుతున్నారని విమర్శించారు. గత 30 ఏళ్లలో ఆక్వా రైతులు ఇలాంటి దారుణమైన పరిస్థితులు ఎప్పుడూ చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇరవై ఏళ్ల క్రితం రొయ్యల ధర కిలో రూ.600 ఉండగా, నేడు కనీసం రూ.300 కూడా లభించడం లేదన్నారు. వైఎస్ జగన్ గతంలో పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం ఆక్వా రంగానికి యూనిట్ విద్యుత్‌ను రూ.1.50 లకే అందించారని, కోవిడ్ సంక్షోభంలోనూ ఆదుకుని, అప్సడా చట్టాన్ని తెచ్చి రక్షణ కల్పి ంచారని గుర్తుచేశారు. కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం విద్యుత్ సబ్సిడీ ఇవ్వకుండా మోసం చేసిందని, స్థానిక కూటమి ఎమ్మెల్యేలు దీనిపై నోరు మెదపకపోవడం దారుణమని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వంలో రెండేళ్లుగా ఆక్వా రైతులు మోసపోతున్నా.. టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న ఉండి మాజీ ఎమ్మెల్యే రాంబాబు ఒక్కసారి కూడా మాట్లాడకపోవడం దారుణమని విమర్శించారు.
ప్రభుత్వం మెడలు వంచాలి
ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు మాట్లాడుతూ... ఆక్వా రైతుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం మెడలు వంచాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఈనెల 15న భీమవరం విచ్చేస్తున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సభకు పార్టీలకతీతంగా ఆక్వా రైతులు, నాయకులు భారీ సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ముందుగా అమెరికా పర్యటన ముగించుకుని నియోజకవర్గానికి వచ్చిన నియోజకవర్గ ఇన్‌చార్జి పీవీఎల్ నరసింహరాజుకు పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు పెనుమత్స దుర్గాప్రసాద్‌రాజు, ఆకివీడు జెడ్పీటీసీ వేగేశ్న వెంకటరాజు, పాలకోడేరు, ఉండి, మండలాల ఆకివీడు పట్టణ అధ్యక్షులు పెనుమత్స ఆంజనేయరాజు, చల్ల బోయిన పాపారావు, అంబటి రమేష్, నియోజకవర్గ నాయకులు, ఆక్వా రైతులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


