నరసాపురం: నరసాపురంలో పుష్కరాల అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం 25 శాతం రుణవాటా కింద అర్బన్ చాలెంజ్ ఫండ్ (యూసీఎఫ్) గ్రాంట్ మంజూరు చేసినట్టు మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ తెలిపారు. శనివారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కేంద్రం గ్రాంటును 25 శాతం రుణం రూపంలో ఇస్తుందని, మిగిలిన 75 శాతం రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తుందన్నారు. ఇప్పటికే రూ.15 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. అంచనాలు తయారు చేసి పనులు మొదలు పెట్టాలని అధికారులను ఆదేశించామన్నారు. యూసీఎఫ్ గ్రాంటు కింద నరసాపురం మున్సిపాలిటీ రూ.34 కోట్ల అర్హత సాధించిందన్నారు. ముందుగా పుష్కరాల అభివృద్ధి పనులు, నిర్వహణపై మున్సిపల్ అధికారులతో మంత్రి సమీక్షించారు. ఎమెల్యే బొమ్మిడి నాయకర్, కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, టీడీపీ ఇన్‌చార్జి పొత్తూరి రామరాజు పాల్గొన్నారు.


