జంగారెడ్డిగూడెంలో అంబేడ్కర్‌ విగ్రహం ధ్వంసం | - | Sakshi
Sakshi News home page

జంగారెడ్డిగూడెంలో అంబేడ్కర్‌ విగ్రహం ధ్వంసం

Jul 11 2026 6:55 AM | Updated on Jul 11 2026 6:55 AM

జంగారెడ్డిగూడెంలో అంబేడ్కర్‌ విగ్రహం ధ్వంసం రూ.8.10 లక్షలకు ఫెర్రీ వేలం ఆటో బోల్తా.. వ్యక్తి మృతి

జంగారెడ్డిగూడెం : స్థానిక ఇందిరానగర్‌ కాలనీలో గురువారం రాత్రి నిర్మాణంలో ఉన్న అంబేడ్కర్‌ భవన పునాదులతో పాటు విగ్రహాన్ని ధ్వంసం చేశారని ప్రముఖ అంబేడ్కర్‌ వాది పీఎస్‌ఎస్‌ఎస్‌ గాంధీ శుక్రవారం ఆవేదన వ్యక్తం చేశారు. గత 26 ఏళ్లుగా కాలనీలో అంబేడ్కర్‌ ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహిస్తున్నామన్నారు. అయితే గురువారం రాత్రి కొందరు దుండగులు దౌర్జన్యంగా ప్రవేశించి అంబేడ్కర్‌ హాలు పునాదులను, స్థలం చుట్టూ వేసిన తాత్కాలిక కాంపౌండ్‌ క్లాత్‌ను ధ్వంసం చేశారని తెలిపారు. నిర్మాణ సామగ్రిని నేలపాలు చేయడమే కాకుండా, ఇక్కడ విగ్రహం ఉండడానికి వీల్లేదంటూ కుల వివక్షతో కూడిన మాటలతో దూషించారని ఆరోపించారు. అంబేడ్కర్‌ విగ్రహం ముక్కును పగలగొట్టారని, ప్రొక్లెయిన్‌తో మొత్తం విగ్రహాన్ని కూలగొడతామంటూ నానా హంగామా చేసి స్థానికులను భయబ్రాంతులకు గురిచేశారని వివరించారు. నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు.

యలమంచిలి: అబ్బిరాజుపాలెం సూరయ్య రేవు ఫెర్రీ వేలం రూ.8.10 లక్షలకు ఖరారైంది. స్థానిక సచివాలయంలో ఇన్‌చార్జి ఎంపీడీఓ జేడీవీ ప్రసాద్‌ పర్యవేక్షణలో గ్రామ కార్యదర్శి ఎం.దుర్గాప్రసాద్‌ వేలం నిర్వహించారు. గ్రామానికి చెందిన శిరిగినీడి శ్రీనివాస్‌, శిరిగినీడి వెంకటేశ్వరరావు చెరో రూ.50 వేలు ధరావతు, రూ.5 లక్షలు సాల్వెన్సీ, పంటు లైసెన్స్‌దారు నుంచి అగ్రిమెంట్‌ తీసుకుని వేలంలో పాల్గొన్నారు. వేలాన్ని రూ.7.50 లక్షల నుంచి ప్రారంభించి రూ.4 లక్షల వరకు తగ్గించారు. అక్కడి నుంచి శిరిగినీడి శ్రీనివాస్‌, శిరిగినీడి వెంకటేశ్వరరావు వేలాన్ని పెంచారు. చివరిగా శిరిగినీడి శ్రీనివాస్‌ రూ.8.10 లక్షలకు దక్కించుకున్నట్లు గ్రామ కార్యదర్శి ఎం.దుర్గాప్రసాద్‌ ప్రకటించారు. ఉన్నతాధికారులకు సమాచారం అందించి వేలం ఖరారు చేస్తామన్నారు. ఈ వేలం 2027 జూన్‌ వరకు అమలులో ఉంటుందని గ్రామ కార్యదర్శి ఎం.దుర్గాప్రసాద్‌ తెలిపారు.

పాలకొల్లు సెంట్రల్‌ : పట్టణంలో ఓ ఆటో బోల్తా కొట్టడంతో వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కోనసీమ జిల్లా రాజోలు మండలం నాగార్జున వీధికి చెందిన గుబ్బల సత్యనారాయణ (57), గుబ్బల రాజేశ్వరి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. ఈ నెల 7న పెద్ద అల్లుడు ఆస్ట్రేలియా నుంచి హైదరాబాద్‌ వస్తున్నారని చూడడానికి వెళ్లిన సత్యనారాయణ దంపతులు శుక్రవారం నర్సాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌కు తిరిగి వచ్చారు. స్టేషన్‌లో దిగిన సత్యనారాయణ దంపతులు బస్టాండ్‌ వరకూ షేరింగ్‌ ఆటో ఎక్కారు. స్టేషన్‌ నుంచి బయలుదేరిన ఆటో డ్రైవర్‌ అతి వేగంగా నడపడంతో దేశాలమ్మ ఆలయం సమీపంలో దుర్గాప్రూట్స్‌ జ్యూస్‌ వద్దకు వచ్చే సరికి బ్రేక్‌ వేయడంతో ఆటో తిరగబడింది. ఈ ఘటనలో సత్యనారాయణకు తీవ్రమైన గాయాలు కావడంతో స్థానికులు హుటాహుటిన 108కు కాల్‌ చేసి స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి భార్య ఫిర్యదు మేరకు కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement