ఆకివీడు: పంట కాలువలు, మురుగు కాల్వల ఆక్రమణలపై స్థానిక రైతులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. మండల పరిధిలోని అయిభీమవరం గ్రామంలో పంట కాల్వ గట్టు వెంబడి విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయడమే కాకుండా, వాటికి సపోర్టుగా మరికొన్ని స్తంభాలను కాల్వ మధ్యలోనే పాతడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఆకివీడు నుంచి ఏలూరు జిల్లా పోతుమర్రు ప్రాంతానికి విద్యుత్ సరఫరా చేసేందుకు గానూ, ఇక్కడ హైటెన్షన్ వైర్ల కోసం ఈ స్తంభాలను నాటారు. కాలువ మధ్యలో సపోర్టింగ్ స్తంభాలు, కాల్వ గట్టును ఆనుకుని ప్రధాన విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయడంతో భవిష్యత్తులో పంట కాల్వను ఆధునికీకరించుకునే అవకాశం లేకుండా పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక రైతుల ఇబ్బందులను పట్టించుకోకుండా, మరో జిల్లాకు విద్యుత్ సరఫరా చేయడం కోసం ఇష్టానుసారంగా స్తంభాలు వేయడంపై రైతులు లబోదిబోమంటున్నారు. ఇప్పటికే కాల్వ గట్లపై ఆక్రమణలు ఉండటంతో కాల్వలను బాగు చేసుకోలేకపోతున్నామని మొరపెట్టుకుంటున్న రైతులకు, ఈ విద్యుత్ స్తంభాల ఏర్పాటుతో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. కాలువలో చెత్త, పూడిక పేరుకుపోయినప్పుడు కాలువ తవ్వకం పనులు చేపడితే ఈ విద్యుత్ స్తంభాలు పక్కకు ఒరిగి ప్రమాదాలు జరిగే అవకాశముందని రైతులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం అసలు కాలువలో పూడిక తీయడమే చాలా కష్టతరంగా మారిందని ఆందోళన చెందుతున్నారు. అసలు నిబంధనలకు విరుద్ధంగా కాలువల్లో విద్యుత్ స్తంభాల ఏర్పాటుకు అధికారులు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ఎందుకు అనుమతులు ఇచ్చారో అర్థం కావడం లేదని పలువురు రైతులు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు.


