ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యా పీఠం ఆధ్వర్యంలో దూర విద్యా విధానంలో నిర్వహిస్తున్న వివిధ కోర్సుల ప్రయోజనాలపై అవసరార్థులకు అవగాహన కలిగించాలని జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకట లక్ష్మమ్మ సూచించారు. ఏపీఓఎస్‌ఎస్ 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఒక రోజు శిక్షణ కార్యక్రమాన్ని శుక్రవారం స్థానిక సుబ్బమ్మదేవి నగరపాలక ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చదువు మధ్యలో ఆపివేసిన వారికి దూరవిద్యా విధానంలో నిర్వహించే పదో తరగతి, ఇంటర్మీడియట్ కోర్సులు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఈ విధానంలో 10వ తరగతి పూర్తి చేసిన వారు రెగ్యులర్ ఇంటర్మీడియట్ కోర్సుల్లో చేరవచ్చని, ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వారు రెగ్యులర్ డిగ్రీ కోర్సుల్లో చేరవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అసిస్టెంట్ కమిషనర్ ఆర్ ఆశ, జిల్లాలోని ఎంఈఓలు, అపోస్ గుర్తింపు పొందిన కేంద్రాల ప్రతినిధులు పాల్గొన్నారు.
కుక్కునూరు: మండలంలోని తొండిపాక పంచాయతీలో ఉపాధి హామీ పథకం పనుల్లో జరిగిన అవకతవకలపై అధికారులు ఎట్టకేలకు చర్యలు చేపట్టారు. ఉపాధి హామీ పనుల్లో అక్రమాలపై సాక్షిలో కథనం నేపథ్యంలో టెక్నికల్ అసిస్టెంట్ (టీఏ), ఫీల్డ్ అసిస్టెంట్ (ఎఫ్‌ఏ)ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వాస్తవంగా పనులు చేయకుండానే చేసినట్లు మస్తర్లు అప్‌లోడ్ చేసి బిల్లులు డ్రా చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో సంబంధిత సిబ్బంది అవకతవకలకు పాల్పడ్డారన్న విషయం వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంపై పత్రికల్లో వచ్చిన కథనాలను అధికారులు సీరియస్‌గా తీసుకుని విచారణ చేపట్టారు. అక్రమాలు జరిగినట్లు తేలడంతో శుక్రవారం సంబంధిత ఫీల్డ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్‌లను సస్పెండ్ చేస్తూ చర్యలు తీసుకున్నారు.


