ద్వారకాతిరుమల : నాణ్యమైన పంటను అందిస్తున్నా గ్రేడింగ్ పేరుతో కోతలు విధించడం సరికాదని ఆయిల్‌పామ్ రైతులు గోద్రెజ్ ఫ్యాక్టరీ యాజమాన్య ప్రతినిధులను నిలదీశారు. ద్వారకాతిరుమల మండలం తిమ్మాపురంలో ఆయిల్ పామ్ రైతు సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. సీహెచ్ పోతేపల్లిలోని గోద్రెజ్ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ పరిధిలోని రైతులు, కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. పలువురు రైతులు మాట్లాడుతూ తాము నాణ్యమైన గెలలను ఫ్యాక్టరీకి సరఫరా చేస్తున్నప్పటికీ గ్రేడింగ్ సాకుతో కోతలు విధిస్తూ అన్యాయం చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా కంపెనీ యాజమాన్యం కోర్టును ఆశ్రయించడం వల్ల రైతులు, కంపెనీ మధ్య సఖ్యత దెబ్బతింటోందని అభిప్రాయపడ్డారు. తక్షణమే ఆ ప్రక్రియను విరమించుకుని, రైతులకు ప్రయోజనం చేకూరేలా యాజమాన్యం నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై ఫ్యాక్టరీ ప్రతినిధి నవనీత్ స్పందిస్తూ రైతుల సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయిల్ పామ్ రైతు సంఘం అధ్యక్షుడు, ద్వారకాతిరుమల దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యుడు చింతమనేని హనుమంతరావు, సొసైటీ చైర్మన్ పోలిన శ్రీనివాసరావు, మాసిరెడ్డి హరిబాబు, అక్కిసెట్టి సుధాకర్, మాజీ జడ్పీటీసీ సభ్యుడు దేవరపల్లి వీరాస్వామి చౌదరి తదితరులు పాల్గొన్నారు.


