తల్లి లేక.. తండ్రి ప్రేమకు నోచుకోక.. | - | Sakshi
Sakshi News home page

తల్లి లేక.. తండ్రి ప్రేమకు నోచుకోక..

Jul 11 2026 6:55 AM | Updated on Jul 11 2026 6:55 AM

తల్లి లేని లోటు, తండ్రి లేని అనాథరికం ఆ పసి హృదయాన్ని నిలువెల్లా దహించివేసింది. రెండేళ్ల క్రితం కన్నతల్లి ఏ కాలువలో దూకి అదృశ్యమైందో.. అదే గోస్తనీ కాలువ ఒడ్డున నిలబడి శుక్రవారం 15 ఏళ్ల లాస్య బలవన్మరణానికి యత్నించింది. ఎందుకు బతకాలి? అనే నిరాశతో ఆ బాలిక తీసుకున్న నిర్ణయం తణుకు హౌసింగ్‌ బోర్డు కాలనీలో విషాదఛాయలు నింపింది.

తణుకు అర్బన్‌: తల్లి లేకపోవడం, తండ్రి బాధ్యతారాహిత్యం వంటి కుటుంబ సమస్యల నేపథ్యంలో 15 ఏళ్ల బాలిక తణుకులో కాలువలోకి దూకి ఆత్మహత్యకు యత్నించింది. తణుకు హౌసింగ్‌ బోర్డు కాలనీకి చెందిన గాలిదేవర పెద్దిరాజు, దుర్గల మనుమరాలు గాలిదేవర శ్రీ యామిని లాస్య (15) పది వరకు చదువుకుని, ప్రస్తుతం ఒక ప్రైవేటు దంత వైద్యశాలలో పనిచేస్తోంది. తండ్రి వెంకటేశ్వరరావు గత కొన్నేళ్లుగా కుటుంబాన్ని వదిలేసి విజయవాడలో ఉంటున్నాడు. దీంతో లాస్య పట్టణంలోని బెల్లం మార్కెట్‌ ప్రాంతంలో మేనత్త సత్యవతి వద్ద, ఆమె చెల్లెలు నానమ్మ ఇంట పెరుగుతున్నారు. శుక్రవారం ఉదయం నానమ్మ ఇంటికి వచ్చి మాట్లాడిన లాస్య ఆసుపత్రికి వెళ్తున్నానని చెప్పి బయలుదేరింది.

తల్లి బాటలోనే కుమార్తె

రెండేళ్ల క్రితం కుటుంబ కలహాల కారణంగా లాస్య తల్లి లక్ష్మి కూడా అదే గోస్తనీ కాలువ వంతెన పైనుంచి దూకి గల్లంతైంది. ఇప్పటికీ ఆమె ఆచూకీ లభించలేదు. ఇప్పుడు కుమార్తె లాస్య కూడా తల్లి మరణించిన అదే ప్రదేశం నుంచే కాలువలోకి దూకడం గమనార్హం.

రక్షించే ప్రయత్నం విఫలం

కాలువలోకి దూకడానికి ముందు లాస్య వంతెనపై అనుమానాస్పదంగా తిరుగుతుండటం చూసి కొందరు ప్రశ్నించగా చేపలు చూస్తున్నానని సమాధానమిచ్చింది. దూకిన తర్వాత సుమారు 200 మీటర్ల దూరం ఆమె నీటిపై తేలుతూ వెళ్తుండటం గమనించిన స్థానిక మహిళలు ఒడ్డుకు రావాలని కేకలు వేశారు. కానీ ఆమె వారిని చూస్తూనే నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. అక్కడ పురుషులెవరూ లేకపోవడంతో ఆమెను కాపాడలేకపోయారు.

పోలీసుల దర్యాప్తు : సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టినా లాస్య ఆచూకీ లభించలేదు. తణుకు పట్టణ ఎస్సై సీహెచ్‌వీ సత్యనారాయణ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. తల్లి లేని లోటు, తండ్రి నిరాదరణ వల్ల మనస్తాపానికి గురై ఆత్మహత్యకు యత్నించింది, లేక మరేదైనా వేధింపుల కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

గోస్తనీ కాలువలో దూకి బాలిక గల్లంతు

రెండేళ్ల క్రితం అదే ప్రాంతంలో కాలువలో దూకిన బాలిక తల్లి

తణుకు హౌసింగ్‌ బోర్డు కాలనీలో విషాదఛాయలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement