భీమవరం (ప్రకాశం చౌక్): ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆరోపిస్తూ అంగన్‌వాడీలు శుక్రవారం భీమవరం కలెక్టరేట్ వద్ద భారీ నిరసన చేపట్టారు. వేతనాలు పెంచే వరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు కే. ఝాన్సీలక్ష్మి, కార్యదర్శి డి.కళ్యాణి మాట్లాడుతూ.. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా, వేతనాల పెంపుపై ఇచ్చిన హామీని ఇంతవరకు అమలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో వేతనాలు పెంచుతామని చెప్పి, నేడు ఆ మాటను విస్మరించారని మండిపడ్డారు. నిత్యావసర ధరలు పదిసార్లు పెరిగినా తమ వేతనాలు మాత్రం అలాగే ఉన్నాయని, పైగా యాప్‌ల పేరుతో పని ఒత్తిడిని పెంచుతున్నారని వారు పేర్కొన్నారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు కే.రాజా రామ్మోహన్ రాయ్ మాట్లాడుతూ.. అంగన్‌వాడీల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. టార్గెట్ల పేరుతో క్షేత్రస్థాయిలో అనధికారికంగా డ్యూటీలు చేయించడం తగదని, సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నిరసన అనంతరం అంగన్‌వాడీలు కలెక్టరేట్ గేటు వరకు ప్రదర్శన నిర్వహించి, అక్కడ బైఠాయించి డీఆర్‌ఓకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నేతలు కర్రి నాగేశ్వరరావు, బి.వాసుదేవరావు, పి.వి.ప్రతాప్, ఎం.ఆంజనేయులు, డి.సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.


