సివిల్‌ కేసుల రాజీకి ప్రాధాన్యత | - | Sakshi
Sakshi News home page

సివిల్‌ కేసుల రాజీకి ప్రాధాన్యత

Jul 8 2026 1:02 AM | Updated on Jul 8 2026 1:02 AM

సివిల్‌ కేసుల రాజీకి ప్రాధాన్యత జాయింట్‌ కలెక్టర్‌ రాహుల్‌కుమార్‌రెడ్డి బదిలీ విద్యాశాఖలో పదోన్నతుల నిలిపివేత అన్యాయం పెరుగుతున్న గోదావరి నీటిమట్టం ఆత్మహత్యకు ఆర్థిక, ఆరోగ్య సమస్యలే కారణం

భీమవరం: ఈనెల 11వ తేదీన నిర్వహించే జాతీయ లోక్‌ అదాలత్‌లో క్రిమినల్‌కేసులతో పాటు సివిల్‌ కేసుల రాజీకి ప్రాధాన్యం ఇవ్వాలని భీమవరం 3వ అదనపు జిల్లా జడ్జి, మండల న్యాయ సేవా సంస్థ చైర్మన్‌ బి.లక్ష్మీనారాయణ అన్నారు. మంగళవారం భీమవరంలో న్యాయవాదులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో జడ్జి లక్ష్మీనారాయణ మాట్లాడారు. కేసుల రాజీ వలన కలిగే ప్రయోజనాలను కక్షిదారులకు తెలియజేయాలన్నారు. అనంతరం న్యాయవాదులు అడిగిన పలు సందేహాలను నివృత్తి చేశారు. సమావేశంలో సివిల్‌ జడ్జి (సీనియర్‌ డివిజన్‌) ఎం సుధారాణి, ఒకటవ అదనపు సివిల్‌ జడ్జి (జూనియర్‌ డివిజన్‌) పి హనీష, 2వ అదనపు జ్యుడీషియల్‌ మొదటి తరగతి మేజిస్ట్రేట్‌ ఎన్‌ జ్యోతి, బార్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు ఆరేపల్లి నటరాజ్‌, జనరల్‌ సెక్రటరీ బడుగు అశోక్‌ బాబు పాల్గొన్నారు.

భీమవరం (ప్రకాశంచౌక్‌) : జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న టి.రాహుల్‌కుమార్‌రెడ్డి బదిలీ అయ్యారు. ఆయన్ను సీఆర్‌డీఏ అడిషనల్‌ కమిషనర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో కె.ఆర్‌.కల్పశ్రీ జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా నియమితులయ్యారు.

భీమవరం : రాష్ట్రంలోని ఇతర అన్ని ప్రభుత్వ శాఖల్లో పదోన్నతుల ప్రక్రియ కొనసాగుతున్నా విద్యాశాఖలో మాత్రం జిల్లా విభజన అనంతరం ఉద్యోగుల కేటాయింపుల అంశాన్ని కారణంగా చూపుతూ పదోన్నతులు నిలిపివేయడం అన్యాయమని ఆంధ్రప్రదేశ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి ప్రకాశం, బీవీ నారాయణ మంగళవారం ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులకు ప్రతి ఏటా బదిలీలు, పదోన్నతులు కల్పించాలనే నిబంధనను సక్రమంగా అమలు చేయకపోవడంతో చాలామంది ఉపాధ్యాయులు నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పదవి విరమణకు దగ్గరలో ఉన్న ఉపాధ్యాయులకు సక్రమంగా పదోన్నతులు అందక పోవడంతో ఆర్థికంగా ఎంతో నష్టపోతారన్నారు. ప్రభుత్వం పోస్టుల ఫ్రీజింగ్‌ గడువు ఈనెల 13వ తేదీ వరకు పెంచిన నేపథ్యంలో ఇప్పటికై నా పదోన్నతులు కల్పించాలని ప్రకాశం, నారాయణ కోరారు.

పోలవరం రూరల్‌: గోదావరి నదిలోకి ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు చేరుతుండటంతో నీటి మట్టం క్రమేపీ పెరుగుతోంది. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో పాటు నదీ పరీవాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాల నీరు నదిలోకి చేరుతోంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద 26.690 మీటర్లకు నీటిమట్టం చేరుకుంది. నీటిమట్టం పెరుగుతుండటంతో స్పిల్‌వే 48 గేట్ల నుంచి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. మహానందీశ్వరస్వామి ఆలయానికి వెళ్లే తాత్కాలిక రోడ్డు మార్గం కోతకు గురై రోడ్డు దిగువన వేసిన తూరలు కూడా కొట్టుకుపోయాయి. ఎగువ నుంచి వర్షపు నీరు చేరుతుండటంతో మరింత నీరు పెరిగే అవకాశం ఉందని ఇంజనీరింగ్‌ అధికారులు చెబుతున్నారు.

ఉంగుటూరు: చేబ్రోలు వద్ద రైలు కింద పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్న ఘటనలో మృతిచెందిన షేక్‌ చాంద్‌ బాషా, అతని భార్య హసీనా, పెద్ద కుమార్తె ఫరీన్‌, చిన్న కుమార్తె సమీరాల మృతదేహాలకు మంగళవారం గుడివాడలో హసీనా తమ్ముడు అబ్దుల్లా అంత్యక్రియలు నిర్వహించారు. సోమవారం సాయంత్రానికి తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం పూర్తి కావడంతో, రైల్వే పోలీసులు మృతదేహాలను బాషా బావమరిదికి అప్పగించారు. తాడేపల్లిగూడెంలో బాషా బంధువులు ఎవరూ లేకపోవడంతో అబ్దుల్లా మృతదేహాలను గుడివాడకు తీసుకెళ్లి అంత్యక్రియలు జరిపారు. వారి మరణానికి గల ప్రధాన కారణాలను కేసు దర్యాప్తు చేస్తున్న సి.ఐ. శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. కుటుంబంలోని నలుగురూ వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, దీనికి తోడు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. ఈ సమస్యలన్నింటికీ చావే పరిష్కారం అనుకుని వారు ఈ దారుణానికి పాల్పడినట్లు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించినట్లు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement