పాలకొల్లు సెంట్రల్: ఫీడ్ కంపెనీలు ధరలు తగ్గించకుండా, ప్రాసెసింగ్ యూనిట్లు రొయ్యల ధరలు పెంచకుండా తాత్సారం చేస్తే ఆక్వా రైతులకు ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ‘క్రాప్ హాలిడే’ (పంట విరామం) ప్రకటిస్తూ ప్రత్యేక జీవో విడుదల చేయాలని రాష్ట్ర ఆక్వా సంఘం అధ్యక్షుడు గొట్టుముక్కల గాంధీ భగవాన్‌రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం పూలపల్లిలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండు రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం అప్సడా ఆధ్వర్యంలో జరిగిన జూమ్ సమావేశంలో రా మెటీరియల్ కొరత సాకుతో ఫీడ్ కంపెనీలు ధరలు పెంచాయని, అదే సమయంలో ఉత్పత్తి పెరిగిందనే నెపంతో ప్రాసెసింగ్ యూనిట్లు రొయ్యల ధరలు తగ్గించాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల 100 కౌంట్‌కు రూ.40 నుంచి రూ.50 వరకు రైతులు నష్టపోతున్నారని పేర్కొన్నారు. దేశంలోనే ఏపీ నుంచి ఆక్వా ఉత్పత్తి ఎక్కువగా జరుగుతున్నందున, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి 100 కౌంట్ రొయ్యలకు రూ.300 మద్దతు ధరను సబ్సిడీ రూపంలోనైనా అందించాలని డిమాండ్ చేశారు. అలాగే మొత్తం ఉత్పత్తిలో 30 శాతాన్ని దేశీయ మార్కెట్‌లో విక్రయించే అవకాశం కల్పించాలన్నారు. ప్రభుత్వం ఈ విధానాలపై స్పందించకుంటే పంట విరామం ప్రకటించడం ద్వారానే మున్ముందు రొయ్యలకు మంచి ధర లభిస్తుందని స్పష్టం చేశారు. వారం రోజుల్లో దీనిపై ప్రత్యక్ష సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆక్వా సంఘం నాయకులు మేడిది జాన్‌రాజు, అంగర వరప్రసాద్, సత్యనారాయణరాజు తదితరులు పాల్గొన్నారు.


