తణుకు అర్బన్: ప్రజల్లో జంతువుల పట్ల ప్రేమతో పాటు సరైన అవగాహన కూడా ఉండాలని, జంతువులు మనుషుల మధ్య సంబంధాల్లో తలెత్తే ఆరోగ్య సమస్యలపై విస్త్రృత ప్రచారం చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని కలెక్టరు చదలవాడ నాగరాణి అన్నారు. ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా తణుకు వెటర్నరీ సిబ్బంది శిక్షణ కేంద్రంలో సోమ వారం రేబిస్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పెంపుడు కుక్కలు, పిల్లులు, ఇతర జంతువులకు తప్పనిసరిగా టీకాలు వేయించాలని సూచించారు. వీధి కుక్కలు, కోతులు, పిల్లులు ఇతర జంతువులు కరిచిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా సమీప ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో రేబిస్ వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, పశు ఆరోగ్య సంస్థ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ వాకాని ప్రసాద్, పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ కోటిలింగరాజు, డిప్యూటీ డైరెక్టర్ లంక కనక సుధాకర్, జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి ఇన్‌చార్జి ఆర్‌ఎంఓ డాక్టర్ ఎల్.సాయి బాలాజీ పాల్గొన్నారు.


