తాడేపల్లిగూడెం (టీఓసీ): పంట కాలువలో దూకి ఓ వ్యక్తి మృతి చెందాడు. గణపవరం మండలం కాశిపాడు గ్రామానికి చెందిన గొట్టాపు చిన్న (30) పంట కాలువలో దూకినట్లు తాడేపల్లిగూడెం ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందింది. దీంతో ఫైర్ సిబ్బంది సోమవారం ఉదయం 6 గంటల నుంచి కాలువలో వెతికినట్లు ఫైర్ ఆఫీసర్ కేవీ మురళీ కొండబాబు తెలిపారు. చిలకంపాడు లాకుల వద్ద మృతదేహాన్ని కనుగొని, బయటకు తీసి, మృతుని బంధువులకు అప్పగించినట్లు ఆయన తెలిపారు.
నూజివీడు: చెల్లని చెక్కు కేసులో నూజివీడుకు చెందిన శీలం పద్మశ్రీకి రూ.2 లక్షల జరిమానా, ఆరు నెలల జైలుశిక్షను విధిస్తూ స్పెషల్ మేజిస్ట్రేట్ వేల్పుల కృష్ణమూర్తి సోమవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం నూజివీడుకు చెందిన వీర్ల వెంకటేశ్వరరావు 2023 అక్టోబర్ 5న పద్మశ్రీకి రూ.1.25 లక్షల నగదును అప్పుగా ఇచ్చారు. కొంతకాలం తరువాత బాకీ చెల్లించమని అడగగా పద్మశ్రీ 2023 డిసెంబరులో రూ.లక్షకు చెక్కును వెంకటేశ్వరరావుకు ఇచ్చారు. ఆ చెక్కును ఆయన బ్యాంకులో వేయగా పద్మశ్రీ బ్యాంకు ఖాతాలో నగదు లేదని బ్యాంకు అధికారులు తిరస్కరించారు. దీనిపై వెంకటేశ్వరరావు కోర్టులో కేసు వేయగా విచారణ అనంతరం స్పెషల్ మేజిస్ట్రేట్ రూ.2 లక్షల జరిమానా, ఆరు నెలల జైలుశిక్ష విధిస్తూ తీర్పును వెలువరించారు.
భీమవరం: సినీ నటుడు నిఖిల్ భీమవరంలో సందడి చేశారు. సోమవారం రక్షాదళ్ సేవా సంస్థ ఆధ్వర్యంలో పలు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లోని విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. అనంతరం నిఖిల్ మాట్లాడుతూ దానాల్లో విద్యాదానం గొప్పదని, రక్షాదళ్ అధ్యక్షుడు మంగదొడ్డి మహేంద్ర ఆధ్వర్యంలో విద్యార్థులకు విలువైన పుస్తకాల కిట్స్ పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. అనంతరం విద్యార్థులకు సెల్పీలకు ఫోజులిచ్చారు. త్వరలో విడుదలైయ్యే తన చిత్రం టికెట్లను విద్యార్థులకు ఉచితంగా అందిస్తానన్నారు. కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు(అంజిబాబు), జిల్లా విద్యాశాఖాధికారి ఇ నారాయణ, మంగదొడ్డి మహేంద్ర, ఎంఈవో ఎన్ శ్రీనివాసరావు, సాయిరామ్, ఎన్‌ఎస్ ప్రసాద్, దాయన చంద్రజీ, షేక్ బాబాజీసాహెబ్ తదితరులు పాల్గొన్నారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలోని వేలేరుపాడు, కుక్కునూరుల్లో ఉన్న కస్తూరిబా బాలికోన్నత పాఠశాలల విషయంలో పాల్పడిన అవినీతికి సంబంధించి ఏలూరు జిల్లా సమగ్రశిక్ష అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ కే. పంకజ్ కుమార్‌ని మాతృ సంస్థకు సరెండర్ చేస్తూ సమగ్రశిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ బీ శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు. కై కలూరు వైవీఎన్‌ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో లెక్చరర్‌గా పని చేస్తున్న పంకజ్ కుమార్‌ను ఏలూరు జిల్లా సమగ్రశిక్ష అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్‌గా గతంలో నియమించారు. ఇటీవల వేలేరుపాడు, కుక్కునూరు కస్తూరిబా బాలికోన్నత పాఠశాలల్లో జరిగిన అవినతీకి సంబంధించి ఆయా పాఠశాలల ప్రిన్సిపాళ్లు ఫిర్యాదు చేశారు. సదరు ఫిర్యాదులపై విచారణ అనంతరం అందిన నివేదికను అనుసరించి ఆయనపై క్రమశిక్షణ చర్య తీసుకున్నట్టు తెలిపారు.
ఏలూరు (టూటౌన్): యూట్యూబర్ ప్రశ్న రావణ్‌పై వరుసగా కేసులు నమోదు చేయడం, ఒక కేసులో బెయిల్ పొందిన వెంటనే మరో కేసులో అరెస్టు చేయడం, అనంతరం కఠిన చట్టాల కింద కేసులు నమోదు చేయడం రాష్ట్రంలో రాజ్యాంగ హక్కులు, భావ ప్రకటనా స్వేచ్ఛ, వ్యక్తిగత స్వేచ్ఛ, న్యాయపాలనపై తీవ్ర ఆందోళన కలిగిస్తోందని వైఎస్సార్సీపీ న్యాయ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డీవీ రామాంజనేయులు ఆందోళన వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 14, 19(1)(ఎ), 21 ప్రతి పౌరుడికి సమానత్వం, భావ ప్రకటనా స్వేచ్ఛ, వ్యక్తిగత స్వేచ్ఛను హామీ ఇస్తున్నాయన్నారు. సుప్రీంకోర్టు పలుమార్లు ‘బెయిల్ ఈజ్ ది రూల్, జైల్ ఈజ్ ది ఎక్సెప్షన్’ అని స్పష్టం చేసిందన్నారు. అలాగే, నేరం కోర్టులో రుజువయ్యే వరకు ప్రతి వ్యక్తి నిర్దోషిగానే పరిగణించబడతాడనే సూత్రాన్ని గౌరవించాలన్నారు. దేశ భద్రత కోసం ఉద్దేశించిన కఠిన చట్టాలను రాజకీయ కక్షసాధింపుకు ఉపయోగిస్తున్నారనే అనుమానాలకు తావు లేకుండా ప్రభుత్వం వ్యవహరించాలని పేర్కొన్నారు.
మృతదేహాన్ని వెలికితీస్తున్న ఫైర్ సిబ్బంది


