ఆలోచింపజేసిన నాటికలు | - | Sakshi
Sakshi News home page

ఆలోచింపజేసిన నాటికలు

Jul 7 2026 1:49 AM | Updated on Jul 7 2026 1:49 AM

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సృజనాత్మక, సాంస్కృతిక సమితి, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నాటక అకాడమీ సౌజన్యంతో హేలాపురి కళా పరిషత్‌ ఆధ్వర్యంలో స్థానిక వైఎంహెచ్‌ఏ హాల్‌లోని కానాల గురుమూర్తి కళావేదికపై నిర్వహిస్తున్న ‘శ్రీ అల్లూరి సీతారామరాజు 18వ స్మారక జాతీయస్థాయి నాటిక పోటీలు’ సోమవారం మూడో రోజుకు చేరుకున్నాయి. 3వరోజు ప్రదర్శించిన నాటికలు నాటక ప్రియులను, రసజ్ఞులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తొలుత హైదరాబాద్‌కు చెందిన స్వర్ణ సూర్య డ్రామా లవర్స్‌ బృందం సీ్త్ర మాత్రే నమః నాటికను ప్రదర్శించారు. బొప్పన నరసింహారావు సౌజన్యంతో ప్రదర్శితమైన ఈ నాటికకు పూర్ణిమ పెమ్మరాజు మూలకథ అందించగా, ఉదయ్‌ భాగవతుల నాటకీకరణ, దర్శకత్వం వహించారు. సమాజంలో సీ్త్ర ఉనికిని చాటిచెప్పే ఈ కథాంశం ప్రేక్షకులను ఆలోచింపజేసింది. అనంతరం గుంటూరుకు చెందిన ఆరాధన ఆర్ట్స్‌ అకాడమీ బృందం సరి గమ పాప అనే నాటికను రంగస్థలంపై అద్భుతంగా ఆవిష్కరించారు. గోకవరపు దీప్తి సౌజన్యంతో ప్రదర్శితమైన ఈ నాటికకు గోవిందరాజుల నాగేశ్వరరావు రచన చేయగా, నాడింపల్లి వెంకటేశ్వరరావు దర్శకత్వం వహించారు. నటీనటుల హావభావాలు, చక్కటి సంభాషణలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసి, సభలో చప్పట్ల వర్షం కురిపించాయి. పరిషత్‌ గౌరవ అధ్యక్షుడు గుత్తా కౌసలేంద్రరావు, అధ్యక్షుడు పెదపాటి రామకృష,్ణ సహాయ కార్యదర్శులు వల్లముల రామాంజనేయులు, మండవ రాజగోపాలకృష్ణ, కోశాధికారి మహ్మద్‌ ఖాజావలి, కమిటీ సభ్యులు ఎస్‌. కస్తూరిరావు, చింతల మల్లేశ్వరరావు, ఎం. సూర్యనారాయణ యాదవ్‌ కార్యక్రమ నిర్వహణలో కీలక పాత్ర పోషించి, కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement