ఆగిరిపల్లి: మండలంలోని కొత్త ఈదరలో విద్యుత్ అధికారులు ఇతర చార్జీల పేరుతో వినియోగదారుల జేబులకు చిల్లు పెడుతున్నారని పలువురు గ్రామస్తులు వాపోతున్నారు. గత నెలలో సాధారణంగా రూ.వెయ్యి వరకు వచ్చిన విద్యుత్ బిల్లులు.. ఈసారి ఇతర చార్జీల పేరిట రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు రావడంతో వినియోగదారులు లబోదిబోమంటున్నారు. దీనిపై విద్యుత్ శాఖాఅధికారులను అడిగితే గత నెలలో అధిక లోడుతో మీ గ్రామంలో రెండు ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోయాయని,.. ఆ నష్టం మీరే భరించాలని చెప్పడంపై వినియోగదారులు మండిపడుతున్నారు. సాంకేతిక లోపాల వల్లనో, అధిక లోడు వల్లనో ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతే ఆ నష్టాన్ని ప్రభుత్వమే భరించాలి గానీ, సామాన్య వినియోగదారులపై రుద్దడం ఏంటని గ్రామస్తుడు అక్కిరెడ్డి ప్రసాద్ వర్మ ప్రశ్నించారు. తాను ఏసీ కూడా వాడటం లేదని, 267 యూనిట్లకు గాను రూ.1384 విద్యుత్ బిల్లు వచ్చిందని, దీనికి తోడు అదర్ చార్జీల పేరుతో రూ.4,550 వచ్చిందని ఏమి చేయాలో అర్థం కావటం లేదని వాపోయారు. దీనిపై విద్యుత్ అధికారులును అడిగితే విద్యుత్ బిల్లు కట్టాల్సిందేనని తేల్చి చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఒకేసారి వేల రూపాయల్లో అదనపు బిల్లులు రావడంతో సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి, నిబంధనలకు విరుద్ధంగా వేసిన ఈ ఇతర ఛార్జీలను విద్యుత్ బిల్లుల నుంచి తక్షణమే తొలగించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.


