ఎరువు కోసం యాప్‌సోపాలు | - | Sakshi
Sakshi News home page

ఎరువు కోసం యాప్‌సోపాలు

Jul 5 2026 7:38 AM | Updated on Jul 5 2026 7:38 AM

ఎరువు కోసం యాప్‌సోపాలు

రౌండింగ్‌ మెలిక.. కోటాకు కోత

ఎరువులు సక్రమంగా అందించాలి

ఎరువులు ఎప్పుడు ఇస్తారు

భీమవరం : వ్యవసాయమే జీవనాధారమైన జిల్లా లో సార్వా వరిసాగు ఆదిలోనే హంసపాదు అన్నట్టు తయారైంది. ఓ పక్క పూర్తిస్థాయిలో వర్షాలు లేక రైతులు సతమతమవుతుంటే మరోపక్క ఎరువులు కొనుగోలుకు తీవ్ర అవస్థలు పడుతున్నారు. పశ్చిమలో 2.35 లక్షల ఎకరాల్లో వరినాట్లు వేయాల్సి ఉంది. ముఖ్యంగా ఎంటీయూ 1318, ఎంటీయూ 1153, 1156, స్వర్ణ వంటి రకాల సాగుకు సన్నద్ధమవుతున్నారు.

నూతన విధానంలో రైతుల పాట్లు

గతంలో రైతులు ఎరువులను ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఎరువుల షాపులో కొనుగోలు చేసి తెచ్చుకునేవారు. అయితే యూరియాకు కేంద్ర ప్రభుత్వం పెద్ద మొత్తంలో సబ్బిడీ ఇవ్వడంతో యూరియా వాడకాన్ని తగ్గించడానికి, వరిసాగుకు గాకుండా ఆక్వా చెరువులు, ఇతర ఫ్యాక్టరీలు అక్రమ వాడకాన్ని అరికట్టడానికి ఈ ఏడాది కేంద్రం అగ్రికల్చర్‌ ఇన్‌ఫర్మేషన్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌(ఏఐఎంఎస్‌) యాప్‌ను అమలులోనికి తెచ్చింది. దీనిద్వారా యూరియా, డీఏపీ ఎరువులు అవసరమైన రైతులు యాప్‌లో పూర్తి వివరాలను తప్పక పొందుపరచాలి. అనంతరం ఎకరాకు 70 కిలోల యూరియా, 40 కిలోల డీఏపీ మాత్రమే మూడు దఫాలుగా ఇస్తారు. ఎరువులు పొందాలంటే రైతులు తప్పనిసరిగా తమ ఈకేవైసీ చేయించుకోవాలి. భూయజమానులే ఎరువులు తెచ్చుకోవడానికి అర్హులు. కౌలు రైతులైతే కౌలు కార్డులు లేదా భూ యజమాని అంగీకారం ఉండాలి.

అధిక ధరలకు యూరియా

రైతుల ఇబ్బందులను ఆసరాగా చేసుకుని కొందరు వ్యాపారులు అధిక ధరలకు యూరియాను విక్రయిస్తున్నారు. 50 కిలోల బస్తా రూ.260 విక్రయించినట్టు రసీదు ఇస్తున్నా రూ.320 వసూలు చేస్తున్నారని రైతులు చెబుతున్నారు. సాగు మొదట్లోనే ఇన్ని సమస్యలు ఉంటే సార్వా సాగును గట్టెక్కించేది ఎలా అని రైతులు మదనపడుతున్నారు.

ఎరువులు ఆన్‌లైన్‌ కేటాయింపుల్లో సాఫ్ట్‌వేర్‌ నిబంధనలు రైతులకు శాపంగా మారాయి. భూమి విస్తీర్ణాన్ని రౌండ్‌ ఆఫ్‌ చేసే విధానం క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా లేదని రైతులు అంటున్నారు. ఉదాహరణకు 1.95 సెంట్ల భూమి ఉన్న రైతుకు 2 ఎకరాల లెక్కన 140 కిలోల యూరియా ఇవ్వాల్సి ఉండగా కేవలం 5 సెంట్లు తక్కువగా ఉందనే సాకుతో దానిని 1.5 ఎకరాలుగా లెక్కించి 105 కిలోలకే పరిమితం చేస్తున్నారు. అలాగే కొన్నిసార్లు యాప్‌ ఓపెన్‌ కాకపోవడంతో గంటల తరబడి ఎరువుల దుకాణాల వద్ద వేచిచూడాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో యాప్‌లో రైతు పేరు రాకపోవడం, భూమి విస్తీర్ణం చూపించకపోవడం, ఓటీపీ రాకపోవడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఖరీఫ్‌ కష్టాలు

రైతులకు తప్పని తిప్పలు

యాప్‌లో బుకింగ్‌తో జాప్యం

దుకాణాల వద్ద పడిగాపులు

సార్వా సాగులో ఇబ్బందులు

ప్రభుత్వం ఏఐఎంఎస్‌ యాప్‌తో సంబంధం లేకుండా రైతులకు ఎరువులు ఇవ్వాలి. యాప్‌ కారణంగా రైతులు ఇబ్బంది పడుతున్నారు. అవసరమైన ఎరువులు దఫదఫాలుగా ఇవ్వడం వల్ల పలుమార్లు షాపుల చుట్టూ తిరగడం రైతులకు కష్టమే. ఈక్రాప్‌ అయితేనే ఎరువు అంటున్నారు. అయితే నాట్లు వేసే సమయంలోనే ఈక్రాప్‌ చేస్తారు. నారుమడి సమయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎరువులు పూర్తిగా అందించాలి.

– బి.బలరామ్‌, కౌలు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement