అభినందనల జల్లు
● విలువ ఆధారిత ఉత్పత్తుల్లో నైపుణ్యం
● ప్రతిభతో ‘ఉద్యాన’ విద్యార్థుల గుర్తింపు
తాడేపల్లిగూడెం: పశ్చిమగోదావరి జిల్లా వెంకట్రామన్నగూడెంలోని డాక్టర్ వైఎస్‌ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయ విద్యార్థులు తేనె, తేనెటీగల మైనం (బీస్ వాక్స్) ఆధారిత ఉత్పత్తులతో అద్భుత ఆవిష్కరణలు చేస్తున్నారు. ప్రిన్సిపల్ సైంటిస్టు డాక్టర్ ఎన్.ఇమ్మాన్యుయేల్ నేతృత్వంలోని అనుభవాత్మక అభ్యాస కార్యక్రమం ద్వారా విద్యార్థులు పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా సహజసిద్ధమైన తేనె ఉత్పత్తుల మార్కెట్ 2026 నాటికి రూ.11 వేల కోట్లకు పైగా చేరుతుందని అంచనా. ఈ నేపథ్యంలో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన స్వీట్ రివల్యూషన్, ఆత్మనిర్భర్ భారత్, వోకల్ ఫర్ లోకల్ వంటి ఆశయాలకు ఈ కళాశాల వేదికగా నిలుస్తోంది.
50కి పైగా వినూత్న ఉత్పత్తులు
● విద్యార్థులు తేనె, మైనంతో 50కి పైగా సహజసిద్ధమైన విలువ ఆధారిత ఉత్పత్తులను అభివృద్ధి చేశారు. వీటిలో ముఖ్యమైనవి
● సౌందర్య, ఔషధ సాధనాలు : మాయిశ్చరైజర్లు, సబ్బులు, బాడీ బటర్, నొప్పి నివారణ బామ్‌లు, దోమల నివారణ క్రీములు.
● గృహోపయోగ, ఇతర వస్తువులు: పర్యావరణ రహిత కొవ్వొత్తులు, బీస్ వాక్స్ క్రేయాన్స్.
● ఆహార ఉత్పత్తులు : తేనె ఆధారిత మిఠాయిలు, పోషక విలువలు గల ఆరోగ్యవర్ధక ఆహారాలు.
● నూరు శాతం సేంద్రియ, స్థానిక వనరులతో తయారైన ఈ పర్యావరణహిత ఉత్పత్తులు తక్కువ ఖర్చుతో కూడుకున్నవి. ఇవి వినియోగదారులకు ఆరోగ్య ప్రయోజనాలను అందించడమే కాకుండా.. గ్రామీణ ఉపాధి, మహిళా సాధికారత, రైతులకు అదనపు ఆదాయాన్ని చేకూరుస్తున్నాయి.
లభించిన పేటెంట్లు.. అవార్డులు
● విద్యార్థులు తయారు చేసిన పెయిన్ రిలీఫ్ బామ్, మస్కిటో రిపెలెంట్ క్రీమ్, మాయిశ్చరైజింగ్ క్రీమ్‌లకు పేటెంట్లు లభించాయి. ఈ ఉత్పత్తుల విక్రయం ద్వారా విద్యార్థులు రూ.5 లక్షలకు పైగా ఆదాయం ఆర్జించారు.
● ఆవిష్కార్ 2022 రాష్ట్రస్థాయి పోటీల్లో మూడో బహుమతి, నిట్ ఆంధ్రప్రదేశ్ నిర్వహించిన స్టార్టప్ ఎక్స్‌పో 2023లో విజేతగా నిలిచారు.
● డాక్టర్ ఎన్.ఇమ్మాన్యుయేల్‌కు ఎక్స్‌లెన్స్ ఇన్ ఇన్నోవేషన్ అవార్డు (2020), ఉద్యానవర్సిటీ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం (2023), ఏపీ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం (2025) లభించాయి.
టాటా ఇన్నోవేషన్ హబ్, వర్సిటీ వ్యవస్థాపక దినోత్సవాల్లో విద్యార్థులు ప్రదర్శించిన స్టాళ్లను మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ ప్రత్యేకంగా ప్రశంసించారు. వర్సిటీ వీసీ డాక్టర్ కె.ధనుంజయరావు మా ర్గదర్శనంలో, డీన్ బి.ప్రసన్నకుమార్, రిజిస్ట్రా ర్ ఎం.మాధవి పర్యవేక్షణలో ఈ పరిశోధనలు, గ్రామీణ విస్తరణ కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి.


