ఏలూరు (టూటౌన్): కేంద్ర ప్రభుత్వ ఆర్థిక, వ్యవసాయ విధానాలు దేశీయ వ్యవసాయ రంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెడుతున్నాయని అఖిల భారత కిసాన్ సభ జాతీయ ఉపాధ్యక్షుడు టి.సాగర్ విమర్శించారు. ఏలూరులో ప్రారంభమైన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం 23వ రాష్ట్ర మహాసభల్లో ఆదివారం ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. విదేశీ వాణిజ్య ఒప్పందాల పేరుతో అమెరికా, బ్రెజిల్, ఆస్ట్రేలియా వంటి దేశాల నుంచి నూనెగింజలు, వంటనూనెలు, పత్తి, మొక్కజొ న్న, పాల ఉత్పత్తుల దిగుమతి సుంకాలను కేంద్రం భారీగా తగ్గించిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల దేశీయంగా ఆయిల్‌పామ్, వేరుశనగ, పత్తి పండించే రైతులతో పాటు.. సుమారు 10 కోట్ల మంది పాడి రైతులు, స్థానిక డెయిరీలు తీవ్రంగా నష్టపోతారని పేర్కొన్నారు. కార్పొరేట్ సంస్థల లక్షల కోట్ల రుణాలను మాఫీ చేస్తున్న కేంద్ర ప్రభుత్వం.. అన్నదాతల రుణమాఫీని మాత్రం విస్మరిస్తోందని మండిపడ్డారు.


