భయం వద్దు
జంగారెడ్డిగూడెం: జంతువుల ద్వారా మనుషులకు సంక్రమించే వ్యాధులు (జూనోటిక్ వ్యాధులు) ప్రస్తుతం పెద్ద సవాల్‌గా మారుతున్నాయి. ఏటా జూలై 6న ప్రపంచ జూనోసిస్ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. 1885 జూలై 6న శాస్త్రవేత్త లూయిస్ పాశ్చర్ రేబీస్ వ్యాధికి విజయవంతంగా మొదటి టీకాను కనుగొన్న సందర్భాన్ని పురస్కరించుకుని ఈ రోజును జరుపుకుంటారు. ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెం ప్రాంతీయ పశువైద్యశాల సహాయ సంచాలకుడు డాక్టర్ పీ.ఎన్.వీ. శేఖర్ దొర జూనోటిక్ వ్యాధుల తీవ్రత, వాటి నివారణపై ప్రత్యేక అవగాహన కల్పించారు.
జూనోసిస్ అంటే ఏమిటి?
జంతువులు, పక్షుల నుంచి మనుషులకు వ్యాపించే అంటువ్యాధులను శ్రీజూనోటిక్ వ్యాధులుశ్రీ అంటారు. ప్రపంచవ్యాప్తంగా మనుషులకు వచ్చే అంటువ్యాధులలో దాదాపు 60 శాతం జంతువుల నుంచే సంక్రమిస్తున్నాయని అంచనా.
వ్యాప్తి చెందే మార్గాలు: వ్యాధి సోకిన జంతువులను తాకడం (డైరెక్ట్ కాంటాక్ట్), వాటి లాలాజలం, రక్తం, మలమూత్రాల ద్వారా, సరిగ్గా ఉడకని మాంసం, పచ్చి పాలు తాగడం ద్వారా, దోమలు, ఈగలు, గోమార్లు (టిక్స్) వంటి కీటకాల ద్వారా ఈ వ్యాధులు మనుషులకు వ్యాపిస్తాయి.
ప్రధానమైన జూనోటిక్ వ్యాధులు
రేబిస్: పిచ్చి కుక్కలు, పిల్లుల కాటు ద్వారా వస్తుంది. నాడీ వ్యవస్థ దెబ్బతిని, నీటిని చూసి భయపడటం (హైడ్రోఫోబియా) దీని ముఖ్య లక్షణం. లక్షణాలు బయటపడితే మరణం ఖాయం.
బర్డ్ ఫ్లూ/స్వైన్ ఫ్లూ: పక్షులు, పందుల ద్వారా వ్యాపించే వైరస్. తీవ్రమైన శ్వాసకోస సమస్యలు, జ్వరం, దగ్గుకు దారితీస్తుంది.
ఆంథ్రాక్స్: గొర్రెలు, మేకలు, పశువుల నుంచి సంక్రమిస్తుంది. చర్మంపై నల్లటి పుండ్లు పడటం, శ్వాస ఆడకపోవడం దీని లక్షణాలు.
బ్రుసెల్లోసిస్: వ్యాధి సోకిన పశువుల పచ్చి పాలు తాగడం ద్వారా వస్తుంది. మనుషులలో కీళ్ల నొప్పులు, పునరావతమయ్యే జ్వరం, గర్భిణీ సీ్త్రలలో గర్భస్రావానికి కారణమవుతుంది.
క్షయ వ్యాధి (టీబీ): వ్యాధి ఉన్న ఆవుల పాలు సరిగా కాచకుండా తాగడం వల్ల మనుషులకు ఊపిరితిత్తుల, పేగుల క్షయ సోకుతుంది.
జూనోటిక్ వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
పెంపుడు జంతువులకు సకాలంలో టీకాలు: ఇంట్లో పెంచుకునే కుక్కలు, పిల్లులు, ఇతర పశువులకు పశువైద్యుల సలహా మేరకు రేబీస్, బ్రసెల్లా వంటి నివారణ టీకాలను సకాలంలో వేయించాలి.
వ్యక్తిగత పరిశుభ్రత: జంతువులను తాకిన తర్వాత, వాటికి మేత వేసిన తర్వాత చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి.
ఆహార నియమాలు: పాలు, పాల పదార్థాలను బాగా కాచి మాత్రమే వాడాలి. మాంసాన్ని బాగా ఉడికించిన తర్వాతే తినాలి. పచ్చి మాంసం ముట్టుకున్నాక చేతులు శుభ్రం చేసుకోవాలి.
బాహ్య పరాన్నజీవుల నిర్మూలన: పశువుల పాకలలో, ఇళ్ల పరిసరాలలో గోమార్లు (టిక్స్), ఈగలు, దోమలు చేరకుండా క్రమం తప్పకుండా క్రిమిసంహారక మందులు చల్లాలి.
అడవి జంతువులకు దూరం: కోతులు, ఎలుకలు, గబ్బిలాలు వంటి వన్యప్రాణులకు దూరంగా ఉండాలి. జంతువుల ప్రవర్తనలో తేడా వస్తే వెంటనే వెటర్నరీ డాక్టర్‌కు సమాచారం అందించాలి.
అప్రమత్తత, పరిశుభ్రతతోనే అడ్డుకట్ట
జూనోటిక్ వ్యాధుల పట్ల భయం వద్దు.. అవగాహన ముఖ్యం. ఒకే ప్రపంచం – ఒకే ఆరోగ్యశ్రీ అనే సంకల్పంతో పశువుల ఆరోగ్యంపై దృష్టి పెడితేనే మానవాళి ఆరోగ్యం సురక్షితంగా ఉంటుంది. జంతువుల యజమానులు, ప్రజలు అప్రమత్తంగా ఉంటూ, పశువైద్య శాలల సేవలను సద్వినియోగం చేసుకోవాలి.
– డాక్టర్ పి.ఎన్.వి. శేఖర్ దొర, సహాయ సంచాలకులు, ప్రాంతీయ పశువైద్యశాల


