ఉంగుటూరు: మండల పరిధిలోని బాదంపూడి గ్రామంలో శనివారం ఉదయం నూతన చిత్ర సినిమా షూటింగ్ సందడిగా సాగింది. దర్శకుడు పవన్ బాసింశెట్టి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలోని పలు కీలకమైన సీన్లను బాదంపూడి గ్రామంలోని భక్తాంజనేయ స్వామి గుడి ప్రాంగణం, గోదావరి కాలువ గట్టు, మెయిన్ రోడ్డుపై చిత్రీకరించారు. కమెడియన్లు సత్య, జబర్దస్త్ రోహిణి, తమిళ హాస్యనటుడు యోగి బాబు, హీరోయిన్ జయశ్రీ, సీనియర్ నటుడు తనికెళ్ళ భరణిలతో పాటు స్థానిక బాదంపూడి గ్రామానికి చెందిన చిన్నారులు కూడా పాల్గొన్నారు. షూటింగ్ అనంతరం భక్తాంజనేయ స్వామి ఆలయంలో పూజారి కె.ఫణికుమార్ ఆధ్వర్యంలో సినీ ప్రముఖులతో స్వామివారికి ప్రత్యేక అభిషేకం, పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
తాడేపల్లిగూడెం (టీఓసీ): కూటమి ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా విద్యార్థులకు, యువకులకు ఇచ్చిన అన్ని హామీలను తక్షణమే అమలు చేయాలని, ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఐయస్‌ఏ) ఐసా రాష్ట్ర కార్యదర్శి ఎస్.నాగార్జున డిమాండ్ చేశారు. తాడేపల్లిగూడెంలో శనివారం ఐసా జిల్లా కమిటీ సమావేశం జిల్లా కార్యదర్శి టి.అప్పలస్వామి అధ్యక్షతన జరిగింది. నాగార్జున మాట్లాడుతూ గత ఎన్నికలు సందర్భంగా కూటమి, ముఖ్యంగా టీడీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకు, యువకులకు అనేక రకాలైన హామీలు ఇచ్చిందని, విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేస్తామని చెప్పారని, రెండేళ్లు కావస్తున్నా పెండింగ్‌లో ఉన్న బకాయిలు విడుదల కాలేదన్నారు. బకాయిలు విడుదల చేయకపోవడం వల్ల విద్యార్థులు అనేక ఇబ్బందులకు గురి అవుతున్నారని వాపోయారు. నిరుద్యోగ భృతి ఏమైందని ప్రశ్నించారు. ఈ నెల 8న విజయవాడలో జరిగే ఐసా, ఆర్‌వైఏ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి వర్క్‌షాపునకు జిల్లా నుంచి విద్యార్థులు హాజరై జయప్రదం చేయాలని తెలిపారు.
నూజివీడు: పట్టణంలోని, మండలంలోని విత్తనాల దుకాణాలను, విత్తన కంపెనీని వ్యవసాయశాఖ తనిఖీ బృందం శనివారం తనిఖీ చేసింది. దీనిలో భాగంగా ఏలూరు ఏడీఏ అనిల్‌కుమారి తనిఖీలు నిర్వహించారు. పట్టణంలోని అన్నదాత సీడ్స్‌ను తనిఖీ చేయగా రూ.31 వేలు విలువ కలిగిన 31 బస్తాల వరి విత్తనాలు స్టాకు తేడా ఉండటాన్ని గమనించారు. మీర్జాపురంలోని సీపీ సీడ్స్ కంపెనీలో తనిఖీలు చేయగా అక్కడ రూ.11.76 లక్షల విలువ కలిగిన 1.680 టన్నుల మొక్కజొన్న విత్తనాలు స్టాకు రిజిస్టర్‌లో నమోదుకు, భౌతిక నిల్వకు తేడా ఉన్నట్లు గమనించారు. దీంతో ఈ రెండు చోట్ల విత్తనాల విక్రయాలు జరపకుండా నిలుపుదల చేశారు. ఈ సందర్భంగా ఏడీఏ మాట్లాడుతూ విత్తనాల డీలర్లు స్టాక్ రిజిస్టర్, బిల్ బుక్‌లు నిర్వహణ సక్రమంగా నిర్వహించాలన్నారు. రైతులందరూ తాము కొనుగోలు చేసిన విత్తనాలకు తప్పనిసరిగా డీలర్ల వద్ద నుంచి బిల్లులు పొందాలని సూచించారు.
యలమంచిలి: అబ్బిరాజుపాలెం ఫెర్రీ వేలం మరోసారి వాయిదా పడింది. సరైన లైసెన్స్ కానీ, అగ్రిమెంట్ కానీ లేకుండా పాటదారులు పాటకు హాజరు కావడంతో ఈ నెల 9కి పాటను వాయిదా వేస్తున్నట్లు పంచాయతీ కార్యదర్శి ప్రకటించారు. ఈసారి ధరావతును రూ.20 వేల నుంచి రూ.50 వేలకు, సాల్వెన్సీని రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచడంపై పాటదారులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఫెర్రీ వేలం గడువు పూర్తయినా పడవలు తిరుగుతున్నాయని, అధికారులు రేవు కొనసాగించవద్దని కంటి తుడుపుగా బోర్డు పెట్టి చేతులు దులుపుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
హాస్య నటుడు యోగిబాబుకు స్వాగతం పలికి, సత్కరిస్తున్న దృశ్యం


