పాలకోడేరు: ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడం, ప్రజా పంపిణీ వ్యవస్థపై శ్రద్ధ కొరవడటం, అప్పటికప్పుడు తోచిన నిర్ణయాలు తీసుకోవడం వంటి కారణాల వల్ల ప్రతి నెలా 26న ప్రారంభం కావాల్సిన నిత్యావసర వస్తువుల పంపిణీ, వారం రోజులు గడిచినా మొదలుకాని దుస్థితి నెలకొంది. ఉండి ఎంఎల్‌ఎస్ పాయింట్ పరిధిలో ఆకివీడు, ఉండి, కాళ్ళ, పాలకోడేరు, భీమవరం రూరల్, గణపవరం మండలాలు, భీమవరం మున్సిపాలిటీ ఉన్నాయి. ఈ పాయింట్ నుంచి ఆయా ప్రాంతాలకు బియ్యం, పంచదార, గోధుమపిండితో పాటు అంగన్‌వాడీ కేంద్రాలకు సరుకులు సరఫరా అవుతుంటాయి. సాధారణంగా ప్రతి నెలా 16 నుంచి 25వ తేదీ లోపు సరుకులు సరఫరా చేస్తే, 26వ తేదీ నుంచి రేషన్ డీలర్లు 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు, దివ్యాంగులకు ఇంటింటికీ వెళ్లి రేషన్ పంపిణీ చేస్తారు. ఈ ఏర్పాటు నిత్యావసర చట్టంలో లేనప్పటికీ, డీలర్లకు ఎలాంటి ప్రతిఫలం అందించకుండానే అధికారులు వారిని బెదిరించి బలవంతంగా ఈ పని చేయించుకుంటున్నారు. అయినప్పటికీ సకాలంలో సరుకులు డెలివరీ ఇవ్వకపోవడంతో జూలై నెల పంపిణీ ఆరు మండలాల్లోని కొన్ని షాపుల వద్ద నిలిచిపోయింది.
గతంలో సరుకు రేషన్ షాపులకు డెలివరీ అయిన వెంటనే ఈ–పాస్ మిషన్‌లో డౌన్‌లోడ్ చేసుకునేవారు. అయితే ఇప్పుడు డీలర్లు స్వయంగా ఉండి ఎంఎల్‌ఎస్ పాయింట్‌కు వెళ్లి వేలిముద్ర వేయాల్సి ఉంటోంది. అలా వేసిన 24 గంటల వరకూ ఈ–పాస్ మిషన్‌లోకి సరుకు వివరాలు రావడం లేదు. గతంలో తక్షణమే పూర్తయ్యే ఈ ప్రక్రియ ఇప్పుడు మూడు రోజుల సమయం తీసుకుంటోంది. సరుకు వచ్చిన వెంటనే థంబ్ వేయడం, ఆ తర్వాత మూడో రోజున ఈ–పాస్ మిషన్‌లోకి డేటా డౌన్‌లోడ్ కావడం వంటి సాంకేతిక సమస్యలతో ఆలస్యం జరుగుతోంది. ఈ విధానంలో 26వ నుంచి డోర్ డెలివరీ మొదలవ్వాలంటే, 24 నాటికే సరుకును రేషన్ షాపులకు చేర్చాల్సి ఉంది. గోదాముల్లో పంచదార, గోధుమ పిండి నిల్వలు సరిపడా ఉండడం లేదు. గతంలో మూడు నెలలకు సరిపడా స్టాక్ నిల్వ ఉండేది. ఇప్పుడు ఏ నెలకు ఆ నెల సరిపడా సరుకులు అందుబాటులో లేకపోవడంతో ప్రజా పంపిణీ వ్యవస్థకు తరచూ అంతరాయం కలుగుతోంది. ప్రజా పంపిణీ పటిష్టంగా అమలు కావాలంటే రేషన్ డీలర్లపై కొరడా ఝళిపించడమే పరమావధిగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు తప్ప, అసలు సమస్యలను పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదే విషయమై ఎంఎల్‌ఎస్ పాయింట్ అధికారులను ప్రశ్నించగా, సాంకేతికంగా కొన్ని మార్పులు చేస్తున్నందునే ఈ సమస్య వచ్చిందని, వచ్చే నెల నుంచి పంపిణీని మరింత పటిష్టంగా అమలు చేయడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారని చెబుతున్నారు.
నేటికీ సరుకుల దిగుమతి పూర్తి కాని వైనం


