తణుకు అర్బన్: పేద బడుగు బలహీన వర్గాల కోసమే ప్రాణాలు కోల్పోయిన మహానేత వంగవీటి మోహనరంగా అని బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్రయాదవ్ అన్నారు. వంగవీటి మోహనరంగా జయంతి సందర్భంగా తణుకు కాపు కల్యాణమండపంలో శనివారం నిర్వహించిన కాపు రిజర్వేషన్ పోరాట సమితి (కేఆర్‌పీఎస్) కాపు గళం రాష్ట్రస్థాయి సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కాపుల రిజర్వేషన్ సాధనకు బీసీవై కూడా సహకరిస్తుందన్నారు. బీసీలు, దళితులు, కాపులపై దాడులు, హత్యలు కలవరపరుస్తున్నాయని, మన పిల్లల భవిష్యత్తు హరించే పరిస్థితి నేడు ఉందన్నారు. పేద బడుగు, బలహీన వర్గాల కోసం పోరాడిన వంగవీటి మోహనరంగా ఆశయాలను గుర్తుచేశారు. కాపులు, బీసీలు, ఎస్సీలు రాజ్యాధికారం కోసం ఐక్యంగా పోరాడాలని, కేవలం ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోవద్దని పిలుపునిచ్చారు. జనాభా దామాషా ప్రకారం కాపులకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నేతలు డిమాండ్ చేశారు.
కాపు జేఏసీ నాయకుడు తోట రామకృష్ణ మాట్లాడుతూ, కూటమి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని నిలదీశారు. రిజర్వేషన్ల కోసం పోరాడిన ముద్రగడ పద్మనాభంపై ప్రభుత్వం అనుసరించిన తీరును తప్పుబట్టారు. కాపులకు రిజర్వేషన్ ఇచ్చిన మహనీయుడు దామోదరం సంజీవయ్య అని.. ఆయనతో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబును పోల్చుకోవడం కూటమి మంత్రి అవివేకమని అన్నారు. సామాజిక విశ్లేషకురాలు కన్నా రజిని మాట్లాడుతూ, రాజ్యాధికారమే లక్ష్యంగా కాపు జాతి ముందుకు సాగాలని అన్నారు. ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం కుదుటపడి, తిరిగి ఉద్యమాన్ని భుజానకెత్తుకోవాలని కోరారు. రాష్ట్ర కన్వీనర్ రావి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో చనమల్ల ప్రసాదరావు, మాసాబత్తుల శ్రీనివాస్ తదితర కేఆర్‌పీఎస్ నాయకులు, అధిక సంఖ్యలో కాపు సామాజికవర్గ ప్రజలు పాల్గొన్నారు.
రిజర్వేషన్ల కోసం కేఆర్‌పీఎస్ సదస్సు


