నిడమర్రు: పెదనిండ్రకొలను ఎస్సీ కాలనీలో రహదారి సరిహద్దు వివాదం ఒకరి ప్రాణాలను బలిగొంది. ఈ ఘర్షణలో ఒకరు మృతి చెందగా, ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన మద్దా యాకోబు (42), రిటైర్డ్ పోలీస్ కానిస్టేబుల్ చాగంటి ఏసుదాసు కుటుంబాల మధ్య కొంతకాలంగా స్థల వివాదం నడుస్తోంది. ఏసుదాసు ఇంటికి వెళ్లే పంచాయితీ రోడ్డును యాకోబు ఆక్రమించి రేకుల షెడ్డు వేసుకున్నారని ఆరోపణ. ఈ మేరకు ఏసుదాసు పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ వివాదంపై శనివారం స్థానిక ఎంపీడీఓ విజయకుమారి, తహసీల్దార్ గద్దె శ్రీధర్‌బాబులు స్పందించి, ఇరు కుటుంబాలకు నచ్చజెప్పారు. ఇద్దరూ సంబంధిత పత్రాలను తీసుకువస్తే విచారించి న్యాయం చేస్తామని, అప్పటివరకు ఎలాంటి ఘర్షణలకు దిగవద్దని హెచ్చరించి వెనుదిరిగారు. అధికారులు వెళ్లిన కొద్దిసేపటికే, అంటే మధ్యాహ్నం 4 గంటల సమయంలో, రోడ్డు నిర్మాణం కోసం ఏసుదాసు కంకర వేస్తుండగా మరోసారి వివాదం తలెత్తింది. ఇరు కుటుంబాల మధ్య మొదలైన వాగ్వివాదం ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో చాగంటి ఏసుదాసు, ఆయన భార్య పండు, కుమారుడు సుబ్బారావు కలిసి యాకోబు కుటుంబ సభ్యులపై గునపంతో దాడి చేశారు. ఈ ఘటనలో యాకోబు (42) మెడపై తీవ్ర గాయమై అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. తీవ్రంగా గాయపడిన యాకోబు భార్య ప్రసన్న, కుమారుడు వంశీని చికిత్స కోసం తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని ఏలూరు డీఎస్పీ శ్రావణ్‌కుమార్ పరిశీలించి, వివరాలను వెల్లడించారు. ఈ కేసును సీఐ రజనీకుమార్, ఎస్సై ఫణికుమార్ దర్యాప్తు చేస్తున్నారు.
రహదారి వివాదంలో వ్యక్తి హత్య


