జంగారెడ్డిగూడెం: వైఎస్సార్‌సీపీ, వామపక్షాల ఆధ్వర్యంలో పొగాకు రైతులకు మద్దతు ధర కల్పించాలనే డిమాండ్‌తో ఈ నెల 7న జంగారెడ్డిగూడెంలో చేపట్టే భారీ రైతు నిరసన కార్యక్రమం సన్నాహక సమావేశం శుక్రవారం జంగారెడ్డిగూడెంలోని జెట్టి కార్యాలయంలో జరిగింది. వైఎస్సార్‌సీపీ చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ కంభం విజయరాజు మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జూలై 7న ఉదయం 9 గంటలకు భారీ ధర్నా నిర్వహిస్తున్నామని చెప్పారు. కూటమి ప్రభుత్వం రైతుల సమస్యలను పూర్తిగా విస్మరించిందని, గతంలో మొక్కజొన్న, మిరప, నాటు పొగాకు రైతులు తీవ్ర నష్టాలు చవిచూశారని మండిపడ్డారు. ప్రస్తుతం పొగాకు రైతులకు సరైన మద్దతు ధర లభించక రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం నియోజకవర్గ ఇన్‌చార్జ్ తెల్లం బాలరాజు మాట్లాడుతూ పొగాకు రైతులు తీవ్ర ఆవేదనతో ఉన్నారన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో కరోనా సంక్షోభం ఉన్నప్పటికీ మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దించి ప్రభుత్వం పొగాకు కొనుగోలు చేసి రైతులకు కొండంత అండగా నిలిచిందని పేర్కొన్నారు. చంద్రబాబుకు రైతులంటే ఇష్టం ఉండదని, గతంలో విద్యుత్ ఉద్యమం చేసిన రైతులపై కాల్పులు జరిపిన చరిత్ర ఆయనదని అన్నారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి, మచిలీపట్నం పార్లమెంట్ పరిశీలకులు జెట్టి గురునాథరావు మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో, సీపీఐ, సీపీఎం, సీపీఐఎంఎల్ పార్టీల సహకారంతో, రైతు సంఘాల అభ్యర్థన మేరకు ఈ మహా ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ధర్నాకు వచ్చే ప్రజల కోసం తమ కార్యాలయం పరిధిలో భోజన వసతులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు జగ్గవరపు జానకిరెడ్డి, కొయ్యలగూడెం ఎంపీపీ గంజిమాల రామారావులతో పాటు తుమ్మలపల్లి గంగరాజు, మంతెన సోమరాజు, గంటా శ్రీను, జంగారెడ్డిగూడెం మండలం అధ్యక్షుడు ఓరుగంటి నాగేంద్ర కుమార్, పట్టణాధ్యక్షుడు కర్పూరం గుప్తా తదితరులు పాల్గొన్నారు.


