కాళ్ల: కూటమి ప్రభుత్వానికి రెండేళ్లలోనే రాష్ట్ర ప్రజల్లో పూర్తి వ్యతిరేకత వచ్చిందని నరసాపురం పార్లమెంటు పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణం రాజు, ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్ అన్నారు. కాళ్ల మండలం పెద అమిరం పార్టీ కార్యాలయంలో శుక్రవారం నియోజవర్గ స్థాయి బీఎల్‌ఏలతో సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ మన ఓటు కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క బీఎల్‌ఎపై ఉందని స్పష్టం చేశారు. మన ఓటును మనం కాపాడుకోకపోతే రానున్న రోజుల్లో సంక్షేమ పథకాలు అందటం కష్టమవుతుందని ప్రతి ఇంటికి వెళ్లినప్పుడు బీఎల్‌ఏ లందరూ చెప్పాలని తెలిపారు. ఈ రెండేళ్లలో కూటమి ప్రభుత్వానికి మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి అంటే భయం ఏర్పడిందన్నారు. కూటమి ప్రభుత్వానికి రెండేళ్లకే పూర్తి వ్యతిరేకత వచ్చిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల గెలుపు బీఎల్‌ఎలపైనే ఉందని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి కష్టపడ్డ ప్రతి ఒక్కరికి పెద్దపీట వేస్తారని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఒక్కటీ నెరవేర్చకుండా పరిపాలన చేస్తుందని, ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని విమర్శించారు. సర్‌ను అడ్డుపెట్టుకుని ప్రజల్ని మోసం చేయాలని చూస్తున్నారని తప్పుపట్టారు. ఒక్క ఓటు పోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలిపారు. వేరే ప్రాంతంలో ఉన్నా, బయట దేశాల్లో ఉన్నా మన ఓటును ఏ విధంగా కాపాడుకోవాలో ఈ కార్యక్రమంలో తెలిపారు. ఉండి నియోజకవర్గంలో పీవీఎల్ నరసింహరాజును ఎమ్మెల్యేగా గెలిపించుకోవడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు పెనుమత్స ప్రసాదరాజు, ఆకివీడు నగర పంచాయతీ చైర్‌పర్సన్ జామి హైమావతి, పార్టీ నాయకులు కామన నాగేశ్వరరావు, నంద్యాల సీతారామయ్య, పడాల కిషోర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


