భీమవరం (ప్రకాశంచౌక్): ‘సర్’ కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న డిజిటలైజేషన్ ప్రక్రియను జూలై 8 నాటికి వంద శాతం పూర్తి చేయడానికి సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేసి లక్ష్యాన్ని తప్పనిసరిగా సాధించాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు. పొరపాట్లు లేని, కచ్చితమైన, పారదర్శకమైన, స్వచ్ఛమైన ఓటర్ల జాబితా రూపొందించడమే ప్రత్యేక సంక్షిప్త సవరణ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. శుక్రవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలు నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్ ్స ద్వారా ప్రత్యేక సంక్షిప్త సవరణ కార్యక్రమం పురోగతిని కలెక్టర్ సమీక్షించారు. మండల ప్రత్యేక అధికారులు, ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారులు, సహాయ ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. ఎక్కడా ఆలస్యం జరగకుండా అధికారులు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. రాబోయే నాలుగు రోజులు అత్యంత కీలకమైనవని ప్రతి బూత్‌లో పురోగతిని రోజువారీగా సమీక్షించాలని సూచించారు. బీఎల్‌వోలు క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే సమయంలో తప్పనిసరిగా ఐడీ కార్డులు ధరించాలని ఆదేశించారు.
ఎస్‌ఐఆర్‌ను వేగవంతం చేయాలి
కాళ్ల: సర్ ప్రక్రియను నిబంధనలకు అనుగుణంగా పూర్తి చేయాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కాళ్ల మండలం పెదఅమిరం పంచాయతీ పరిధిలో కొనసాగుతున్న ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బీఎల్‌ఓలు, రెవెన్యూ సిబ్బందితో సమీక్షించారు. ఓటర్ల మ్యాపింగ్ పురోగతి, పెండింగ్ వివరాలు, ఫాంల పంపిణీ, పూర్తయిన దరఖాస్తుల స్వీకరణ, డిజిటలైజేషన్ పురోగతి తదితర అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.


