తణుకు అర్బన్ : ‘స్మార్ట్ మీటరు వద్దు మొర్రో’ అని మొత్తుకున్నా వినకుండా విద్యుత్ సిబ్బంది బలవంతంగా బిగించడంతో, ఓ పేద కుటుంబానికి ఏకంగా రూ. 14,539 బిల్లు వచ్చింది. తణుకు మండలం దువ్వ గ్రామం హరిజనవాడకు చెందిన సిర్రా రమేష్ నివాసంలో ఆయన తల్లి రత్నకుమారి పేరుతో విద్యుత్ సర్వీస్ ఉంది. ఎస్సీ కోటా కింద గతంలో వీరికి 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వర్తించేది. అయితే, గత నెల 20న సిబ్బంది వచ్చి పాత మీటరు పాడైందంటూ బలవంతంగా స్మార్ట్ మీటరు బిగించారు. తాజాగా మొబైల్‌కు రూ. 14,539 బిల్లు రావడంతో బాధితులు దిగ్భ్రాంతికి గురయ్యారు. వినియోగదారుల అనుమతి లేకుండా స్మార్ట్ మీటర్లు బిగించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చదువుకోని పేదల పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై విద్యుత్ శాఖ డీఈ కె.నరసింహమూర్తిని వివరణ కోరగా పాత మీటరు స్ట్రక్ అవ్వడం వల్ల గతంలో వాడిన యూనిట్లు నిలిచిపోయాయని, దీనివల్ల స్లాబ్ మారి బిల్లు ఎక్కువగా వచ్చిందని తెలిపారు. బిల్లును సరిచేస్తామని, అనుమతి లేకుండా స్మార్ట్ మీటరు బిగించకూడదు కాబట్టి దానిని వెంటనే మారుస్తామని వివరించారు.


