కామవరపుకోట: విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి చెందిన ఘటన శుక్రవారం జలపావరిగూడెం గ్రామంలో చోటు చేసుకుంది. తడికలపూడి ఎస్సై వల్లి పద్మ తెలిపిన వివరాల ప్రకారం జంగారెడ్డిగూడెం మండలం చక్ర దేవరపల్లికి చెందిన దూదిపాల రవికుమార్ 27 సంవత్సరాలు వృత్తిరీత్యా వెల్డింగ్ పనులు చేస్తుంటాడు. ఈ నేపథ్యంలో కామవరపుకోట మండలం జలపువారిగూడెం గ్రామానికి చెందిన కాంతారెడ్డి సత్యనారాయణరెడ్డి ఆయిల్‌పామ్ తోట ఎదురుగా ఉన్న పశువుల షెడ్ నిర్మాణ స్థలంలో శుక్రవారం ఉదయం వెల్డింగ్ పని చేస్తుండగా, ట్రాన్స్‌ఫార్మర్ ఫ్యూజ్ బాక్స్ వద్ద విద్యుత్ సరఫరాను పరీక్షించే సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. వెంటనే జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ మేరకు దూదిపాల పోతురాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వల్లి పద్మ తెలిపారు.
కుక్కునూరు: కుక్కునూరుకు చెందిన బొల్లు జగదీష్ అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. శుక్రవారం ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (ఏపీఎన్‌ఆర్‌టీఎస్) తరఫున యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) దేశ కోఆర్డినేటర్‌గా బోల్లు జగదీష్ ను నియమించింది. కుక్కునూరులో జన్మించిన జగదీష్ హైస్కూల్ విద్య వరకు స్వగ్రామంలోనే పూర్తి చేసి, ఉన్నత విద్య అనంతరం ఉపాధి కోసం దుబాయ్‌కు వెళ్లి అక్కడ స్థిరపడ్డారు. అక్కడ ప్రవాస ఆంధ్రుల సంక్షేమం, అభ్యున్నతికి కృషి చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. రాష్ట్ర ఎన్‌ఆర్‌ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఏపీఎన్‌ఆర్‌టీఎస్ అధ్యక్షుడు రవికుమార్ జగదీష్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.
మండవల్లి: ఏలూరు జిల్లా డీపీఆర్‌ఓగా దుర్గాప్రసాద్ పదోన్నతి పొందారు. ప్రస్తుతం ఆయన డీపీఆర్‌ఒ కార్యాలయంలో అడిషనల్ డీపీఆర్‌ఓగా పని చేస్తున్నారు. దుర్గాప్రసాద్ నియామకంపై పలువురు అధికారులు, డీపీఆర్‌ఒ కార్యాలయ సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.
భీమవరం : పట్టణంలో వేరువేరు ప్రాంతాల్లో పార్కింగ్ చేసిన రెండు మోటారుసైకిల్స్ చోరీ చేశారని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసులు టూటౌన్ పోలీసుస్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. గణపవరం మండలం సరిపల్లి గ్రామానికి చెందిన జి.అశోక్‌కుమార్ పట్టణంలోని ఒక ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్నాడు. గత నెల 27న అశోక్‌కుమార్ రాయలం గ్రామంలోని సాయిబాబా ఆలయం వద్ద బైక్‌ను పార్క్ చేసిన గుడిలోనికి వెళ్లి తిరిగివచ్చేసరికి బైక్ మాయమైంది. దీనిపై టూటౌన్ పోలీసు హెచ్‌కానిస్టేబుల్ ఎస్‌ఎన్ భూషణం కేసు నమోదు చేశారు. అలాగే గుంటూరు జిల్లా తెనాలికి చెందిన పి.బాలాజీసత్యకుమార్ గత నెల 5న టౌన్ రైల్వేస్టేషన్ వద్ద పార్కింగ్ చేసిన మోటారుసైకిల్ ఆదృశ్యమైంది. దీంతో భాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు శుక్రవారం హెచ్‌కానిస్టేబుల్ టి గోవిందరాజు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
పెనుగొండ: కుటుంబ కలహాల నేపథ్యంలో తల్లీ కొడుకులు ఆత్మహత్యాయత్నం చేయగా తల్లి మృతి చెందిన ఘటన మండలంలో చోటు చేసకుంది. వివరాల ప్రకారం వల్లూరు శివారు చిల్లేవారిపాలెంలో గుండె వెంకట రమణ(47), గుండే నరేంద్ర(21)ల మధ్య కుటుంబ కలహాలు జరుగుతున్నాయి. ఈ తరుణంలో శుక్రవారం సాయంత్రం తల్లి గుండె వెంకట రమణ యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నం చేయడంతో, అదే యాసిడ్‌ను కొడుకు నరేంద్ర లాక్కొని తాగాడు. దీంతో స్థానికులు 108లో తణుకు ఏరియా ఆసుపత్రికి తరలించగా, తల్లి వెంకటరమణ అప్పటికే మృతి చెందగా, కొడుకును మెరుగైన వైద్యం నిమిత్తం భీమవరం ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై కె.వెంకట రమణ తెలిపారు.
భీమవరం: బంగారు ఆభరణాలను చోరి కేసులో ముద్దాయికి రెండేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ భీమవరం రెండో అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఎన్. జ్యోతి శుక్రవారం తీర్పు చెప్పారు. సీఐ ఎ. రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని కళాభవన్ వీధికి చెందిన వి.కృష్ణవేణి 2019 జులై 17న పాలకోడేరు మండలం వేండ్ర గ్రామంలోని పుట్టింటికి వెళ్లి తిరిగొచ్చేసరికి తాళాలు పగలగొట్టి మూడు కాసుల బంగారు ఆభరణాలను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారని ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి, నిడదవోలుకు చెందిన మొహిద్దీన్ అలీని అప్పట్లోనే అరెస్టు చేసి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. విచారణ అనంతరం శుక్రవారం తీర్పునిచ్చారు.


