భీమడోలు: స్థానిక గోలి అపార్ట్‌మెంట్‌లో చోరీకి గురైన స్కూటర్‌ను భీమడోలు పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఒక యువకుడితో పాటు అతనికి సహకరించిన మైనర్ బాలుడిని అరెస్ట్ చేశారు. భీమడోలు సీఐ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ వి.కృష్ణ కేసు వివరాలను వెల్లడించారు.గోలి అపార్ట్‌మెంట్‌లో అద్దెకు ఉంటున్న గుట్టుట దుర్గాప్రసాద్ ఈ నెల 1వ తేదీ రాత్రి తన సుజుకి యాక్సిస్ స్కూటర్‌ను పార్క్ చేసి, తాళాలను వాచ్‌మెన్ గదిలో భద్రపరిచారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆ తాళాలు పగులగొట్టి స్కూటర్‌ను చోరీ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు సీఐ వి.కృష్ణ పర్యవేక్షణలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితేభీమడోలు జంక్షన్‌లోని సంతమార్కెట్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా, అనుమానాస్పదంగా వస్తున్న ఒక స్కూటర్‌ను ఆపేందుకు ప్రయత్నించారు. దానిపై ఉన్న ఇద్దరు వ్యక్తులు పారిపోయేందుకు యత్నించగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారు ద్వారకాతిరుమల మండలం గుణ్ణంపల్లికి చెందిన వసంతటి మణిబాలాజీ (19)తో పాటు ఒక మైనర్ బాలుడిగా గుర్తించారు. తామే ఆ స్కూటర్‌ను దొంగిలించినట్లు నిందితులు అంగీకరించడంతో, వారి నుంచి రూ. లక్ష విలువైన వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు మణిబాలాజీని భీమడోలు కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్ విధించింది. మైనర్ బాలుడిని జువైనల్ జస్టిస్ బోర్డు ఎదుట హాజరుపరిచి, హోంకు తరలించారు. ప్రధాన నిందితుడు మణిబాలాజీపై గతంలోనూ ఒక కేసు ఉందని సీఐ తెలిపారు. ఈ కేసును వేగంగా ఛేదించిన హెడ్ కానిస్టేబుల్ సయ్యద్ బాజి, ఎస్. శ్రీనివాసరావు, పోలీస్ సిబ్బందిని సీఐ అభినందించారు.


