తాడేపల్లిగూడెం (టీఓసీ): తాడేపల్లిగూడెంలోని 6వ వార్డు మామిడి తోటలోని టీటీడీ కల్యాణ మండపం రోడ్డు మూల, షిర్డీ సాయి బాబా ఆలయం వద్ద విద్యుత్ అధికారులు నూతన ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటుచేశారు. ఇక్కడ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌లో సాంకేతిక లోపాలతో నెల రోజులుగా సమస్యలు ఏర్పడ్డాయి. దీనిపై పలుమార్లు ‘సాక్షి’ కథనాలను ప్రచురించింది. శుక్రవారం నూతన 100 కేవీ ట్రాన్స్‌ఫార్మర్‌ను విద్యుత్ సిబ్బంది ఏర్పాటుచేశారు. స్థానికులు ‘సాక్షి’కి కృతజ్ఞతలు తెలిపారు.
భీమవరం: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని, మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కలెక్టర్ సీహెచ్ నాగరాణి పిలుపునిచ్చా రు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం భీమవరం విష్ణు కళాశాల ఆవరణలో అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. విద్యార్థులతో కలిసి సీడ్ బాల్స్ తయారు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో రెండు లక్షల సీడ్ బాల్స్ తయారీ లక్ష్యంగా కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. జేసీ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి, జిల్లా అటవీ శాఖ అధికారి ఆశాకిరణ్, రేంజ్ ఆఫీసర్ ఎం.కరుణాకర్, ఎ్‌ఫ్‌బీఓ కె.రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
భీమవరం: విద్యార్థుల్లో విద్యా ప్రగతితో పాటు నైతిక విలువలు, సృజనాత్మకత, నాయకత్వ ల క్షణాలు, సామాజిక బాధ్యత పెంపొందించేలా ఉపాధ్యాయులు శ్రద్ధ చూపాలని సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్ట్ కో–ఆర్డినేటర్ పి.శ్యామ్‌సుందర్ అన్నారు. స్థానిక బీవీ రాజు మున్సిపల్ హై స్కూల్‌లో నిర్వహిస్తున్న జ్ఞానప్రకాశ్ కార్యక్రమాన్ని శుక్రవారం ఆయన పరిశీలించారు. వి ద్యార్థుల సమగ్ర వికాసానికి ఈ కార్యక్రమం దోహదపడుతుందన్నారు. జిల్లాలో ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.
భీమవరం: జిల్లాలో శుక్రవారం నిర్వహించిన ఎస్‌ఎస్‌సీ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఇంగ్లిష్ పరీక్షకు 585 మందికి 254 మంది విద్యార్థులు హా జరయ్యారు. ఫ్లయింగ్ స్క్వాడ్స్, జిల్లా కో–ఆర్డినేటర్ 22 కేంద్రాలను తనిఖీ చేయగా ఎక్కడా మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని డీఈఓ ఈ.నారాయణ తెలిపారు.
41 కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు
జిల్లాలోని 41 పరీక్షా కేంద్రాల్లో శుక్రవారం ఇంటర్మీడియెట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరిగాయి. ఫస్టియర్ జనరల్ పేపర్‌కు 1,043 మందికి 914 మంది విద్యార్థులు హాజరయ్యారని డీఐఈఓ జి.ప్రభాకరరావు తెలిపారు. ఒకేషనల్ పరీక్షకు 107 మందికి 54 మంది హాజరయ్యారు. సెకండియర్ జనరల్ పరీక్షకు 4,527 మందికి 3,808 మంది, ఒకేషనల్ పరీక్షకు 127 మందికి 61 మంది హాజరయ్యారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఇంటర్మీడియెడ్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష పేపర్ల మూల్యాంకనం ఆదివారం నుంచి ప్రారంభించనున్నట్టు ఇంటర్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి కె.యోమాన్ ఓ ప్రకటనలో తెలిపారు. స్థానిక కోటదిబ్బ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రారంభమవుతుందన్నారు. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల సిబ్బంది హాజరుకావాలన్నారు.


