పాత రోజులు గుర్తుకొచ్చాయి
తణుకు అర్బన్: తణుకులోని ఎస్‌ఎంవీఎం పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణం ఆదివారం ఆత్మీయ ఘట్టానికి వేదికై ంది. దాదాపు 49 సంవత్సరాల క్రితం (1977–80) సివిల్ ఇంజినీరింగ్ చదవిని స్నేహితులంతా మళ్లీ ఒకేచోట చేరి ఆనాటి జ్ఞాపకాల్ని పంచుకున్నారు. ఆరు పదుల వయసులో ఉన్న వీరంతా.. ఈ ఆత్మీయ సమ్మేళనంలో మళ్లీ పాత విద్యార్థులుగా మారిపోయారు. తమ చిన్ననాటి ఫొటోలను ఐడీ కార్డులుగా వేసుకుని పలకరించుకున్నారు. ఏరా గుప్తా.. ఏంటోయ్ రెడ్డి.. బాగానే ఉన్నావురా అంటూ ఆప్యాయతతో పలకరించుకుంటుంటే, అక్కడి వాతావరణం స్నేహ బంధానికున్న గొప్పదనాన్ని చాటిచెప్పింది.
గుర్తుకొస్తున్నాయి అంటూ..
గురువుల చేతిలో తిన్న దెబ్బలు, క్లాసులు ఎగ్గొట్టి ఆడిన చూసిన సినిమాలు, చదువులో పోటీ... ఇలా జ్ఞాపకాల్ని నెమరువేసుకున్నారు. స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం అంటూ పాటల సందడి చేశారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఆనాటి గురువులు ఎ.కామేశ్వరరావుతో పాటు, కళాశాల మాజీ ప్రిన్సిపాల్ రాజేంద్రబాబు, ప్రస్తుత ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.తులసిరాధ తదితరులను పూర్వ విద్యార్థులు సత్కరించారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనాలు స్నేహితులంతా కలిసి ఆరగించారు.
చదువు తర్వాత ఉద్యోగ, వ్యాపారాల్లో దేశవిదేశాలకు స్థిరపడిన స్నేహితులంతా కుటుంబ సమేతంగా ఈ వేడుకకు విచ్చేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేసిన వి.గోపాలరెడ్డి, ఎం.వెంకటేశ్వర గుప్త, వి.శ్రీనివాసరావు, ఎస్.వెంకటరాజు, డాక్టర్ పి.కృష్ణంరాజు, ఎస్.కామేశ్వరశర్మ, ఎం.వెంకటరావులను మిత్రులంతా ప్రత్యేకంగా అభినందించారు.
49 ఏళ్ల స్నేహ బంధం ఒక్కటైన వేళ
49 ఏళ్ల తరువాత బాల్య స్నేహితులంతా ఒకే చోటకు చేరి ఆత్మీయ సమ్మేళనం చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. మా స్నేహ బంధం ఎంతో మధురమైంది. ఆనాటి తీపి జ్ఞాపకాలను అందరూ నెమరువేసుకున్నాం. మా గురువులు మాకు నేర్పించిన విద్యతో ఎంతో ఉన్నత స్థాయిలో నిలిచాం. చాలా దూర ప్రాంతాల నుంచి ఆత్మీయ సమ్మేళనానికి వచ్చారు. కొందరు స్నేహితులు గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. మా పాత రోజులు గుర్తుకు వచ్చాయి.
– ఎం.వెంకటేశ్వరగుప్త, పూర్వ విద్యార్థి, రిటైర్డు ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు


