శ్రీవారిని, లడ్డూని అవమానించిన కూటమి
తణుకు అర్బన్: పంది కొవ్వు, జంతువుల కొవ్వు కలిసిందంటూ తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదాన్ని అవమానం పాలుచేశారని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు మండిపడ్డారు. లడ్డూలో ఎటువంటి కొవ్వులూ కలవలేదని సీబీఐ సిట్‌లో నివేదిక ఇచ్చిందని, దీనిపై కూటమి నేతలు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. అలాగే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ఏ రకంగా ప్రాయశ్చిత్యం చేసుకుంటారని నిలదీశారు. వేంకటేశ్వరస్వామిని అవమానించి పాపం మూటగట్టుకున్నారన్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా విష ప్రచారం చేసిన కూటమి నేతలను భగవంతుడు క్షమించడని స్పష్టం చేశారు. తిరుపతి లడ్డూ ప్రసాదాన్ని రాజకీయంగా వాడుకున్నారన్నారు.
ఆర్‌ఎస్‌ఎస్, సనాతన ధర్మం, బీజీపీ ఏం చేస్తున్నారు
లడ్డూ కల్తీ జరిగిందని కూటమి నేతలు గుళ్ల చుట్టూ తిరుగుతున్నారని, కానీ తణుకులో ఆవులను, పాలి చ్చే గేదెలను కోసేస్తుంటే ఆర్‌ఎస్‌ఎస్, సనాతన ధ ర్మం, బీజేపీ నాయకులు ఏం చేస్తున్నారని మాజీ మంత్రి కారుమూరి ప్రశ్నించారు. ఏ కల్తీ లేనిచోట రాద్ధాంతం చేస్తున్నారని, కానీ తణుకులో జరుగుతున్న గోవధపై మాత్రం మాట్లాడరని మండిపడ్డారు. చేతనైతే గోవధ నిలిపివేసేందుకు పాటుపడాలని కారుమూరి సూచించారు.
కూటమి కవ్వింపులు
మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు తమ పార్టీ శ్రేణులతో కలిసి ఒకరోజు ముందుగా ప్రకటించిన ప్రకారం శుక్రవారం ఉదయం తణుకులోని రాష్ట్రపతి రోడ్డులోని వేంకటేశ్వరస్వామి ఆలయానికి వచ్చారు. అదే సమయంలో తాము కూడా అదే ఆలయానికి వస్తున్నట్టుగా ఎమ్మెల్యే రాధాకృష్ణ కూడా ప్రకటించారు. దీంతో పోలీసులు సైతం ముందుగానే ఆలయం వద్ద మోహరించారు. ఉద యం 9 గంటల తరువాత మాజీ మంత్రి కారుమూరి, పార్టీ నాయకులతో కలిసి వచ్చి స్వామిని దర్శించుకుని అనంతరం ఆలయం బయట మీడియాతో మాట్లాడారు. అప్పటికే భారీగా వచ్చిన కూటమి నాయకులు కారుమూరి కారు ఎక్కిన తరువాత ‘కల్తీ లడ్డూ గోవింద’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అయినా కారుమూరితో పాటు పార్టీ శ్రేణులు సైతం సంయమనం పాటించారు. కూ టమి నేతల నినాదాలు, కవ్వింపులతో ఏం జరుగుతుందోనని పోలీసు అధికారులు ఆందోళనకు గురయ్యారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షుడు మారిశెట్టి శేషగిరి, రాష్ట్ర లీగల్ సెల్ అధికార ప్రతినిధి వెలగల సాయిబాబారెడ్డి, పంచాయతీరాజ్ రాష్ట్ర కార్యదర్శి వడ్లూరి సీతారాం, పబ్లిసిటీ వింగ్ జిల్లా అధ్యక్షుడు జల్లూరి జగదీష్, నియోజకవర్గ మహిళాధ్యక్షురాలు మెహర్ అన్సారీ, పట్టణ మహిళాధ్యక్షురాలు నూకల కనకదుర్గ తదితరులు పాల్గొన్నారు.
ఎలాంటి కొవ్వులూ కలవలేదనిసీబీఐ నివేదిక
బాబు, పవన్ ఎలా ప్రాయశ్చిత్తం చేసుకుంటారు ?
మాజీ మంత్రి కారుమూరి ఆగ్రహం


