వారానికే కుప్పకూలిన డ్రెయినేజీ గోడ
● నాణ్యత డొల్ల.. నిర్మాణం గుల్ల
● చంద్రబాబు ప్రభుత్వంలో పనుల తీరిది
నూజివీడు: చంద్రబాబు ప్రభుత్వంలో కాంట్రాక్టర్లు సిండికేట్ అయ్యే విషయంలోను, పనులను పంచుకోవడంలో చూపుతున్న శ్రద్ధ అభివృద్ధి పనుల నాణ్యతపై చూపడం లేదు. పర్యవేక్షించాల్సిన అధికారులు పనులు జరుగుతున్న ప్రాంతానికి రా కుండా కార్యాలయాల్లోనే కూర్చోని కాలం వెళ్లబుచ్చుతుండటంతో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. నూజివీడులో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో బాపూనగర్ రోడ్డులో నిర్మించిన సీసీ డ్రెయినేజీ గోడ శుక్రవారం కుప్పకూలింది. ఈ డ్రెయిన్‌ను నిర్మించి పట్టుమని వారం రోజులు కాకుండానే కూ లిపోవడం సంచలనంగా మారింది. మున్సిపాలిటీ చరిత్రలోనే ఇలాంటి సంఘటన చోటుచేసుకోలేదని, ఇంత దారుణంగా అభివృద్ధి పనులు నిర్వహించడంపై ప్రజలు విస్మయం వ్యకం చేస్తున్నారు. బాపూనగర్ రోడ్డులో రామకృష్ణ మఠం ఎదురుగా మురుగునీరు వెళ్లే వాగుకు రూ.9 లక్షల అంచనాతో సీసీ డ్రెయినేజీ నిర్మిస్తున్నారు. ఈ పనులను సాయి సారథి ఇన్‌ఫ్రా అనే కాంట్రాక్టు కంపెనీ దక్కించుకుంది. ఈనెల 24న సీసీ డ్రెయినేజీని నిర్మించగా వారం రోజులు తిరగకుండానే గోడ కూలిపోయింది.
నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా..
నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే డ్రెయినేజీ గోడ కూలి ఉండవచ్చని భావిస్తున్నారు. కాలువ అడుగు భాగంలో బెడ్ సరిగా వేయకుండానే గోడలను నిర్మించడం, అది కూడా ఎస్టిమేషన్‌లో పేర్కొన్న విధంగా చేసి ఉండరనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంజనీరింగ్ సిబ్బంది అభివృద్ధి పనులను దగ్గరుండా పర్యవేక్షించాల్సి ఉండగా ఇటువైపు పనులను చూడలేదని స్థానికులు చెబుతు న్నారు. వర్క్ ఇన్‌స్పెక్టర్, సచివాలయ ఇంజినీరింగ్ అసిస్టెంట్, ఏఈ, డీఈలు ఉన్నా ఒక్కరూ కూడా వచ్చి పనులను పర్యవేక్షించలేదని అంటున్నారు. నిర్మాణ సమయంలో సిమెంట్, కంకర, ఇసుక ఏ దామాషాలో కలుపుతున్నారనే దానిపై కూడా పట్టించుకున్న వారే లేరనే విమర్శలు ఉన్నాయి.
విజిలెన్స్ విచారణకు డిమాండ్
కూలిన సీసీ డ్రెయినేజీ గోడను వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షుడు, కౌన్సిలర్ శీలం రాము, మున్సిపల్ వైస్ చైర్మన్ కొమ్ము వెంకటేశ్వరరావు, కౌన్సిలర్ కొడవటి రాంబాబు, నాయకులు తలారి సతీష్, పిళ్లా చరణ్, గిరి వరలక్ష్మి, ఉదయగిరి కృపారావు తదితరులు పరిశీలించారు. కూటమి ప్రభుత్వంలో పనులు పంచుకోవడానికి చూపుతున్న శ్రద్ధ నాణ్యతతో చేయడానికి చూపడం లేదన్నారు. అధికారులు కూడా అధికార పార్టీ నాయకులు, కాంట్రాక్టర్ల మాటలు వినడమే తప్ప నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా పనులు చేయించకపోవడంతోనే ఈ దుస్థితి ఎదురైందన్నారు. ప్రస్తుతం పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులన్నింటిపై విజిలెన్స్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పనుల నాణ్యతపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు.


