నారసింహుని కల్యాణోత్సవాలకు వేళాయె
క్షేత్ర విశిష్టత ఇదీ
ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయానికి దత్తత దేవాలయమైన ఐఎస్ జగన్నాధపురంలోని సుమనోహర సుందరగిరి పర్వతంపై.. శ్రీ కనకవల్లీ సమేత శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి దివ్య కల్యాణ మహోత్సవాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. భీష్మ ఏకాదశి పర్వదినం మొదలుగా ఆరు రోజుల పాటు ఈ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. అందులో భాగంగా ద్వారకాతిరుమల దేవస్థానం అధికారులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఆలయం వద్ద భక్తుల సౌకర్యార్థం షామియానా, చలువ పందిళ్లు, ప్రత్యేక దర్శనం క్యూలైన్లను నిర్మించారు. విద్యుద్దీప అలంకారాలు, ఇతర పనులు తుది దశకు చేరుకున్నాయి. ఉత్సవాలు జరిగే రోజుల్లో రాత్రి 7 గంటల నుంచి ఆలయం వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు జరుగనున్నాయి. ఇదిలా ఉంటే ఆహ్లాదకర వాతావరణంలో, పురాణ ప్రాశస్త్యం గల ఈ ఆలయాన్ని దర్శిస్తే కోరిన కోర్కెలు తీరి, సకల శుభాలు కలుగుతాయన్నది భక్తుల నమ్మకం. అందుకే ఏకాదశి వంటి పర్వదినాల్లో వేలాదిగా భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తుంటారు. చిన వెంకన్న దేవస్థానం ప్రతి ఏటా స్వామివారి దివ్య కల్యాణ మహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది.
మతంగి మహర్షి తపస్సు ఫలితంగా ఈ సుందరగిరి పర్వతంపై శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారు స్వయంభూగా, శాలిగ్రామ రూపంలో వెలిశారు. ఇప్పటికీ మతంగి మహర్షి సర్ప రూపంలో స్వామి వారిని నిత్యం సేవిస్తారని ప్రసిద్ధి. ఆలయం వెనుక ఎన్నో ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఉన్న పుట్ట ఇందుకు సాక్ష్యమని ఆలయ అర్చకులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఉగ్ర రూపంలో ఉన్న స్వామివారిని శాంతింప జేసేందుకు 1995లో తమిళనాడుకు చెందిన శ్రీధర్ గురూజీ, హైదరాబాద్‌కు చెందిన ఆయన ప్రధాన శిష్యులు కొచ్చెర్లకోట నరసింహ గురూజీలు ఆలయ ఆవరణలో కనకవల్లీ దేవి అమ్మవారి విగ్రహాన్ని, అలాగే అష్ట దిక్కులలో 8 మండపాలను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ఏ ఆలయంలోను లేనటువంటి ఏకాక్షరి గణపతి, కాలభైరవుడు, సర్ప వెంకటేశ్వరుడు, చింతామణి గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, దత్తాత్రేయుడు, నవగ్రహాలు, అలాగే ఆలయ క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామివారు ఇక్కడ భక్తులకు దర్శనమిస్తున్నారు. ప్రతి ఏటా మహా శివరాత్రి పర్వదినం నాడు కొచ్చర్లకోట సత్యవెంకట నరసింహ గురూజీ ఆధ్వర్యంలో మహా సుదర్శన యాగాన్ని పెద్ద ఎత్తున జరుపుతున్నారు. అందులో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొంటున్నారు.
రేపటి నుంచి ఐఎస్ జగన్నాధపురంలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి కల్యాణోత్సవాలు ప్రారంభం
6 రోజుల పాటు జరగనున్న ఉత్సవాలు
31న స్వామివారి కల్యాణం
తుది దశకు ఏర్పాట్లు
నారసింహుని కల్యాణోత్సవాలకు వేళాయె
నారసింహుని కల్యాణోత్సవాలకు వేళాయె


