పడమర వైపు ప్రహరీ.. పట్టించుకొనేవారేరి? | - | Sakshi
Sakshi News home page

పడమర వైపు ప్రహరీ.. పట్టించుకొనేవారేరి?

Jan 28 2026 8:44 AM | Updated on Jan 28 2026 8:44 AM

పడమర

పడమర వైపు ప్రహరీ.. పట్టించుకొనేవారేరి?

త్వరలోనే నిర్మాణం చేపడతాం

పాలకొల్లు సెంట్రల్‌: పంచారామక్షేత్రం శ్రీ క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో బేడా మండపం పడమర వైపు ప్రహరీ ప్రమాదకరంగా ఉంది. గత సంవత్సరం కార్తీకమాసం నవంబర్‌ నెల మొదటి వారంలో అప్పుడు కురిసిన వర్షాలకు ఆలయం బేడా మండపంలో పడమర వైపు ప్రహరీగోడ బయట వైపున 15 అడుగులు మేరకు అండలుగా పడిపోయింది. ఈ గోడకు ఆలయం లోపల భాగంలో సరస్వతి, కుమారస్వామి, మహిషాసురమర్థిని దేవతా విగ్రహాలు ఉన్నాయి. ఇవి కాక గోడపై భక్తుల సహకారంతో వివిద దేవతల బొమ్మలు ఉన్నాయి. ఆలయం వెనుక డచ్‌ వారికి చెందిన గోళీగుంట స్థలం ఉంది. ఆ స్థలంలోకి గోడ అండలుగా పడిపోవడంతో బయట కర్రలు బోటు పెట్టి ఉంచారు. కార్తీకమాసంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో బేడా మండపంలో భక్తులు తిరగకుండా సరస్వతి దేవి విగ్రహం నుంచి మహిషాసురమర్థిని విగ్రహం వరకూ హడావుడిగా కర్రలు కట్టారు. నేటికి దాదాపు మూడో నెల కావస్తున్నా మరమ్మతు పనులపై అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రమాదం జరిగితేనే గాని చలనం రాదా?

గత సంవత్సరం సింహాచలం ఆలయంలో, విజయనగరంలో వేంకటేశ్వరస్వామి ఆలయాల్లో ప్రమాదాలు జరిగి భక్తులు మృత్యువాత పడిన విషయం అందరికీ తెలిసిందే. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా వేగంగా చర్యలు తీసుకోవలసిన అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో ఫిబ్రవరి 15న మహాశివరాత్రి, మార్చి 19న ఉగాది, 27న శ్రీరామనవమి, 28న క్షీరారామలింగేశ్వరస్వామివారి కల్యాణం జరగనున్నాయి. ఈ పర్వదినాల్లో ఆలయం కిటకిటలాడుతుంది. ముఖ్యంగా మహాశివరాత్రికి ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. ఈ సందర్భంగా ప్రమాదకరంగా ఉన్న పడమర వైపు బేడా మండపంలోకి భక్తులను వెళ్లకుండా ఆపగలరా? ఒకవేళ భక్తుల తాకిడి ఎక్కువైతే దేవదాయ శాఖ అధికారులు ఏమి చర్యలు చేపడతారని భక్తులు ప్రశ్నిస్తున్నారు. గోడ పడి మూడు నెలలు కావస్తున్నా ఎండోమెంట్స్‌ ఇంజనీరింగ్‌ అధికారులకు ఎస్టిమేషన్లు వేసే ఖాళీయే లేదా లేక ఎస్టిమేషన్లు వేయలేకపోతున్నారా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.

శిథిలావస్థలో బేడా మండపం, ప్రహరీగోడ

గతంలోనూ ఆలయం ఉత్తర వైపు దక్షిణామూర్తి, నటరాజస్వామి, బాణాసురుడు, దత్తాత్రేయులు, కాలభైరవుడు, నాగేంద్రుడు విగ్రహాలు ఉన్న ప్రహరీగోడ వెలుపల వైపు అంటే గోశాల వైపు గోడ పడిపోయింది. దానికి మరమ్మతులు చేసి ప్రహరీగోడ నిర్మాణం చేశారు. గోడ మొత్తం అడుసుతో కట్టినట్లుగా ఉంది. బేడా మండపం అంతా లీకేజి అవుతుండడంతో ప్రమాదకరంగా ఉంటుంది. 2027లో పుష్కరాలు వస్తుండడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అధికారులు తీసుకునే చర్యలు తూతూమంత్రంగా కాకుండా ఒకసారి ఆలయం బేడా మండపం ప్రహరీగోడను పరిశీలించి పూర్తిగా తొలగించి నిర్మాణం చేయాలా లేదా అనేది ఆలోచించి చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.

గతంలో ఆలయం ఉత్తరం వైపు గోడ పడిపోయిన సందర్భంలో ఎలా నిర్మాణం జరిగిందో ప్రస్తుతం పడమరలో పడిపోయిన గోడ కూడా ఆ నమూనాలో నిర్మాణం చేసేలా అంచనాలు తయారు చేస్తున్నారు. డీఈ వచ్చి రెండు రోజుల్లో ఎస్టిమేషన్లు తయారు చేసి పంపిస్తామని అన్నారు. అంచనాల పత్రాలు వచ్చిన అనంతరం వాటిని విజయవాడ ఏడీఎంకు పంపించాలి అక్కడి నుంచి అనుమతులు వచ్చిన వెంటనే టెండర్లు పిలవడం జరుగుతుంది. అతి త్వరలోనే నిర్మాణ పనులు చేపడతాం.

– ముచ్చర్ల శ్రీనివాసరావు, ఆలయ కార్యనిర్వహణాధికారి, పాలకొల్లు

ప్రమాదకరంగా క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో బేడా మండపం పడమర వైపు ప్రహరీ

నాడు పడిపోతున్న గోడకు కర్రలు అడ్డుపెట్టిన వైనం

అప్పటినుంచి పట్టించుకోని యంత్రాంగం

పడమర వైపు ప్రహరీ.. పట్టించుకొనేవారేరి? 1
1/1

పడమర వైపు ప్రహరీ.. పట్టించుకొనేవారేరి?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement