కల్తీ విత్తనాలతో నష్టం
కొయ్యలగూడెం: కల్తీ విత్తనాలతో తీవ్రంగా నష్టపోయామని పొంగుటూరు, గవరవరం గ్రామాల సమీపంలో మొక్కజొన్న పంట వేసిన రైతులు గగ్గోలు పెడుతున్నారు. అధిక లాభాలు వస్తాయని ఆశ చూపి సీడ్ పెట్టించారని, తీరా చూస్తే చేను మొలకెత్తలేదని, ఇదేంటని కంపెనీ ప్రతినిధులను ప్రశ్నిస్తే పెట్టుబడిగా ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వమని ఒత్తిడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యవర్తుల ద్వారా బెదిరింపులకు దిగుతున్నారని వాపోయారు. మంగళవారం పలువురు రైతులు విలేకరుల ఎదుట తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఐదు ఎకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నానని రైతు నిమ్మగడ్డ కిషోర్ తెలిపారు. కంపెనీ సీడ్ ఎకరానికి నాలుగు టన్నుల దిగుబడి వస్తుందని చెప్పడంతో పెట్టుబడి పెట్టామని, ప్రస్తుతం చేను సగానికి పైగా మొలకెత్తలేదని చెప్పారు. కంపెనీ ప్రతినిధులను సంప్రదిస్తే భాస్వరం లోపం అంటూ పంచదార, డీఏపీ లిక్విడ్, ఇసబియన్ మందులు కొట్టమన్నారని, వాటితోనూ ఎలాంటి ఫలితం లేకపోయిందన్నారు. అనంతరం కంపెనీ ప్రతినిధులు స్వయంగా వచ్చి చూసి, మీరు కొట్టిన మందుల వల్లే పంట నష్టం జరిగిందని చెప్పి ఇప్పటివరకు పెట్టుబడిగా ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వమని ఒత్తిడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరో రైతు గుడిసె పోసరావు మాట్లాడుతూ తన మూడు ఎకరాల్లో పంట నష్టపోయినట్లు చెప్పారు. మధ్యవర్తులు డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారని వాపోయారు. తాము చిన్న, సన్నకారు రైతులమని, మరో పంట వేసే స్థోమత కూడా లేకుండా పోయిందన్నారు. రైతు వామిశెట్టి పవన్ కుమార్ మాట్లాడుతూ, మూడు ఎకరాల్లో కంపెనీ సీడ్ వేసినట్లు తెలిపారు. దాదాపు ఒక ఎకరం పూర్తిగా నష్టపోయిందని, మిగిలిన రెండు ఎకరాలు కూడా పోతాయేమోనని భయంగా ఉందన్నారు. మరో రైతు గుడిసె సత్యనారాయణ మాట్లాడుతూ, రెండు ఎకరాలపైగా కంపెనీ సీడ్ వేస్తే నష్టం వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు.
గగ్గోలు పెడుతున్న మొక్కజొన్న రైతులు


