శేష వాహనంపై శోభనాచలుడు
ఆగిరిపల్లి: స్థానిక శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీనరసింహస్వామి మాఘమాసం మంగళవారం రాత్రి చిన్న శేష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 9 గంటలకు ఆలయంలో నాగిరెడ్డి పాపా అప్పారావు దంపతులు కై ంకర్యపరులుగా వ్యవహరించి స్వామివారికి శాంతి కల్యాణం జరిపారు. రాత్రి 8 గంటలకు వైశ్య సంఘం ఆధ్వర్యంలో నిత్య కల్యాణ మహోత్సవాన్ని ఆలయ ప్రధాన అర్చకులు వేదాంతం శేషుబాబు, అనంత కృష్ణ వైభవంగా నిర్వహించారు.
జంగారెడ్డిగూడెం: గుర్వాయిగూడెం శ్రీ మద్ది ఆంజనేయస్వామి ఆలయంలో మంగళవారం విశేష పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. స్వామి వారికి తమలపాకులతో అష్టోత్తరం పూజలను, అన్నప్రాసనలు, వాహనం పూజలను ఆలయ అర్చకులచే నిర్వహించుకున్నారు. ఆలయానికి వివిధ సేవల ద్వారా రూ. 2,07,755 ఆదాయం వచ్చిందని, నిత్యాన్నదానం సత్రంలో 2,221 మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించినట్లు ఆలయ సహాయ కమిషనరు, కార్యనిర్వహణాధికారిణి ఆర్‌వీ చందన తెలిపారు.
తాడేపల్లిగూడెం రూరల్: మండలంలోని ఆరుగొలను డాక్టర్ బీఆర్.అండేడ్కర్ సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్, 5, 6, 7, 8, 9, 10వ తరగతుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సపాల్ ఎం.దుర్గారావు ఒక ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి 19వ తేది లోపు విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. మార్చి 1వ తేదీన ఐదవ తరగతికి, ఇంటర్ ఫస్టియర్‌కు, 2వ తేదీన 6, 7, 8, 9, 10వ తరగతి ప్రవేశాలకు పరీక్షలు నిర్వహించనున్నట్లు వివరించారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
కాళ్ల: ఏఆర్ కానిస్టేబుల్ ఎన్ కన్నయ్య (48) గుండెపోటుతో మృతి చెందారు. కాళ్ల ఎస్సై శ్రీనివాస్ తెలిపిన వివరాలివి. వీరవాసరంకు చెందిన కన్నయ్య పెదఅమిరం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సోమవారం రాత్రి 10 గంటల నుంచి విధులు నిర్వర్తిస్తున్నారు. మంగళవారం ఉదయం ఆయన అపస్మారక స్థితిలో ఉండటాన్ని గమనించి భీమవరం ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఎస్సై శ్రీనివాస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఏలూరు(మెట్రో): ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ సమీక్షా సమావేశానికి అధికారులు బాధ్యతాయుతంగా హాజరుకావాలని చైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ సూచించారు. మంగళవారం స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశానికి అధికారుల గైర్హాజరుపై ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమన్నారు. ఏలూరు జిల్లాలో శానిటేషన్, చెత్త ప్రాసెసింగ్ కార్యక్రమాలకు సంబంధించి డీపీఆర్ ఆధారంగా పనులను వేగవంతంగా ప్రారంభించి, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని చైర్‌పర్సన్ ఆదేశించారు.
శేష వాహనంపై శోభనాచలుడు
శేష వాహనంపై శోభనాచలుడు


