ఏసు ప్రభువు ప్రేమ విశ్వవ్యాప్తమైనది
గణపవరం (ఉంగుటూరు): ఉంగుటూరు మండలం నాచుగుంటలో బైబిలు మిషన్ 88వ మహాసభలు మంగళవారం ఉదయం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ సభలు ఈనెల 29వ తేదీ వరకూ జరగనున్నాయి. మహాసభల్లో ముఖ్య అతిథిగా బైబిల్ మిషన్ అధ్యక్షుడు సజీవరావు ప్రసంగించారు. ఏసుప్రభువు ప్రేమ విశ్వవ్యాపితమైనదని, ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది విశ్వాసులు ప్రభువు సందేశాలను ఆచరిస్తూ వారిజీవితాలను మార్చుకున్నారని అన్నారు. తద్వారా సమాజానికి ఎంతో మేలు జరుగుతుందన్నారు. క్రీస్తు బోధనలు అందరూ ఆచరిస్తే సమాజంలో శాంతి సౌభాగ్యాలు వెల్లివిరుస్తాయన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాలనుంచి విశ్వాసులు ఈ మహాసభల్లో పాల్గొన్నారు. అందరికీ భోజన వసతి సదుపాయాలు కల్పించామని తెలిపారు. ఈ సభలకు వైస్ ప్రెసిడెంట్ ఎ.దైవారావు, కార్యదర్శి డి.ఇమ్మానుయేల్, జాయింట్ సెక్రటరీ జీఆర్ ఇమ్మానియేల్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ మహాసభలకు పరిసర గ్రామాలకు చెందిన విశ్వాసులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
దెందులూరు: దెందులూరులోని ఓ ప్రైవేట్ స్కూల్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. గ్రామానికి చెందిన పాఠశాల బస్సు మంగళవారం విద్యార్థులతో చిన్న దళితవాడ వస్తుండగా వైఎస్సార్ విగ్రహం దాటిన తర్వాత బోరు సమీపంలో రోడ్డు పూర్తిగా పాడైన నేపథ్యంలో బస్సు పక్కకు ఒరిగిపోయింది. ఒకవైపు సీతంపేట కాలువ మరొకవైపు చెరువు ఉండడంతో బస్సు ఎటుపక్కకు ఒరిగినా పెను ప్రమాదం సంభవించేది. అదే సమయంలో అటుగా వస్తున్న వైఎస్సార్‌సీపీ నేత వన్నెకూటి రాజు వెంటనే స్పందించి బస్సు నుంచి చిన్నారులను కిందకు దింపారు. హుటాహుటిన ట్రాక్టర్ ఏర్పాటు చేయించి బస్సును రోడ్డు మీదకు లాగారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు వన్నెకూటి రాజుకు కృతజ్ఞతలు తెలియజేశారు.


