వృద్ధురాలి మెడలో గొలుసు చోరీ
కామవరపుకోట: ఓ ఇంట్లో గుర్తు తెలియని వ్యక్థి అర్ధరాత్రి చొరబడి వృద్ధురాలి మెడలో గొలుసు చోరీ చేసిన ఘటన కామవరపుకోట మండలం గుంటుపల్లి పంచాయతీ జీలకర్రగూడెంలో చోటుచేసుకుంది. తడికలపూడి ఎస్సై పి.చెన్నారావు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన నల్లూరి ధర్మలింగేశ్వరీ అదే గ్రామంలో రోడ్డు పక్కన పాన్ షాప్ నిర్వహిస్తూ జీవిస్తోంది. ఈ క్రమంలో ఆమె ఒంటరిగా నివసిస్తున్నట్లు గమనించిన గుర్తు తెలియని వ్యక్తి సోమవారం రాత్రి ఆమె ఇంట్లో వృద్ధురాలి కంట్లో కారం చల్లి మెడలోని బంగారు గొలుసు లాక్కుని పారిపోయాడు. దీంతో బాధితురాలు ధర్మలింగేశ్వరి మంగళవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఏలూరు క్లూస్ టీంతో ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి వివరాలు సేకరించినట్లు తడికలపూడి ఎస్సై చెన్నారావు తెలిపారు.
పెదపాడు: ఇంట్లోని చెత్తను రోడ్డు అవతలి వైపు పారవేసేందుకు వెళ్లిన ఓ వృద్ధురాలు కారు ఢీకొని దుర్మరణం చెందింది. ఈ ఘటన పెదపాడు పోలీసు స్టేషన్ పరిధిలోని తాళ్లమూడిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన వీరమాచనేని వెంకటసుబ్బారావు భార్య సీతామహాలక్ష్మి (65) 15 ఏళ్లుగా అప్పనవీడు శివారు తాళ్లమూడిలోని తన కుమార్తె బంటు శివదుర్గ అల్లుడు రమేష్‌ల ఇంట్లో నివాసం ఉంటోంది. మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో ఇంట్లోని చెత్తను బయట తారురోడ్డులో డివైడర్ ఆవల పోసేందుకు వెళ్లింది. అదే సమయంలో విజయవాడ వైపు నుంచి ఏలూరు వైపు వెళ్తున్న కారు ఢీకొంది. దీంతో అక్కడికక్కడే మృతి చెందింది. దీనిపై కుమార్తె శివ దుర్గ పెదపాడు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్సై ఆర్ శ్రీనివాస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


