ఆహ్లాదం.. ఆటపాక పక్షుల కేంద్రం
కై కలూరు: పెద్ద పండగ సంక్రాంతి కళ ఆటపాక పక్షుల విహార కేంద్రంలో కనిపిస్తోంది. నూతన ఏడాదికి ఇటీవల సమీప జిల్లాల నుంచి పెద్ద ఎత్తున పర్యాటకులు పక్షుల కేంద్రాన్ని సందర్శిస్తున్నారు. విదేశీ పక్షుల రాకకు అనువైన శీతాకాలం కావడంతో ఇప్పటికే పక్షులు ఆటపాకలో కనువిందు చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఆదివారం పలు జిల్లాల నుంచి పర్యాటకులు పక్షుల వీక్షణకు వచ్చారు. బోటు షికారు చేస్తూ పెలికాన్ పక్షుల కేరింతలను దగ్గర నుంచి తిలకించారు. అదే విధంగా సమీప ఈఈసీ కేంద్రంలో పక్షి నమూనా మ్యూజియంలో పక్షుల విశేషాలను తెలుసుకున్నారు. సమీప చిల్డ్రన్ పార్కులో చిన్నారులు ఆటలాడుకున్నారు. అటవీశాఖ ఫారెస్టు బీట్ ఆఫీసర్ రాజేష్ కొల్లేరు పక్షుల విశేషాలు, నైసర్గిక స్వరూపం వంటి విషయాలను పర్యాటకులకు వివరించారు.
ద్వారకాతిరుమల: మండలంలోని జి.కొత్తపల్లి గ్రామంలో కోడి పందేల స్థావరంపై ఆదివారం పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో 17 మందిని అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ. 31,630 నగదు, కోడి పుంజు, 17 బైక్‌లను స్వాధీనం చేసుకున్నట్టు ఎస్సై టి.సుధీర్ తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసినట్టు చెప్పారు.
జంగారెడ్డిగూడెం: కూతురు పట్ల అసభ్యంగా ప్రవర్తించిన తండ్రిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు జంగారెడ్డిగూడెం ఎస్సై ఎన్‌వీ ప్రసాద్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం జంగారెడ్డిగూడెం మండలం లక్కవరానికి చెందిన నాగరాజు అతని భార్యతో విడిపోయి ఉంటున్నాడు. భార్య జంగారెడ్డిగూడెంలో తన 8 ఏళ్ల కూతురితో జీవిస్తోంది. శనివారం రాత్రి నాగరాజు భార్య ఇంటికి వెళ్లి భార్యను దూషించి బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


