
పైసలిస్తేనే ఆపరేషన్లు
రూ.1000 ఇచ్చాను
● తణుకు పీపీ యూనిట్‌లో నిర్వాకం
● కు.ని. ఆపరేషన్లకు రూ.500 నుంచి రూ.1000 ఇవ్వాల్సిందే
తణుకు అర్బన్: తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌లు చేయించుకోవాలంటే చేయి తడపాల్సిందే.. వైద్య ఆరోగ్యశాఖకు సంబంధించిన పీపీ యూనిట్ విభాగంలో నిర్వహిస్తున్న కుటుంబ నియంత్రణ (కు.ని.) శస్త్రచికిత్సల్లో అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయ. కు.ని. ఆపరేషన్ చేయాలంటే రూ.500 ఇవ్వాలని, ఆపరేషన్ చేయడానికి కొంచెం సమయం ఎక్కువైతే మరొక రూ.500 ఇవ్వాలని వైద్యసిబ్బంది డిమాండ్ చేస్తున్నట్లు బాధితులు చెబుతున్నారు. గత జూన్‌లో బదిలీపై వచ్చిన వైద్యురాలు తమ వైద్య సిబ్బంది ద్వారా ఈ తరహాలో డబ్బులు వసూలు చేస్తున్నారని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శస్త్రచికిత్సలు పూర్తయిన తరువాత వైద్యసిబ్బంది వచ్చి డబ్బులు వసూలు చేసి వైద్యురాలికి ఇస్తున్నట్లుగా బాధితులు చెబుతున్నారు.
మందులు అక్కడే కొనాలి..
పీపీ యూనిట్ విభాగంలో కుని శస్త్రచికిత్సకు వచ్చిన వారు సదరు వైద్యురాలి ప్రైవేటు ప్రాక్టీస్‌గా ఉన్న ఆస్పత్రిలోని మందుల దుకాణంలోనే మందులు కొనుగోలు చేయాల్సివస్తుందని బాధితులు చెబుతున్నారు. జిల్లా కేంద్ర ఆస్పత్రికి ఎదురుగా కూతవేటు దూరంలో ఉన్న ఒక ప్రైవేటు ఆస్పత్రిలోని మందుల దుకాణం నుంచి మందులు తీసుకువచ్చిన తరువాత శస్త్రచికిత్స చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. శస్త్రచికిత్సలకు వచ్చిన వారికి వైద్యురాలు తన ప్రైవేటు ఆస్పత్రి పేరుమీద ఉన్న విజిటింగ్ కార్డును ఇచ్చి అక్కడ మాత్రమే మందులు కొనుగోలు చేయాలని చెబుతుండడం విశేషం. ఏదైనా తేడా వస్తే ఏదోక కొర్రీలు వేసి డిశ్చార్జ్‌ను జాప్యం చేస్తారని బాధితులు వాపోతున్నారు.
కు.ని. శస్త్రచికిత్సలకు సంబంధించి కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత నిర్లక్ష్య ధోరణి కనబరుస్తున్నారు. కూటమి ప్రభుత్వం జనాభా పెంచాలనే యోచనలో కుని శస్త్రచికిత్సలపై పట్టు వదిలేసిన దుస్థితి. గతంలో ప్రతి పీహెచ్‌సీలో కుని శస్త్రచికిత్సలు చేయాలంటూ వైద్యులకు టార్గెట్‌లు పెట్టి మరీ చేయించే పరిస్థితి ఉండేది. నేడు అలాంటి పరిస్థితి లేకపోవడంతో కొందరు వైద్యులు నిర్లక్ష్య ధోరణిని అవలంభిస్తూ ఇదే అదనుగా అవినీతి మార్గంలో అందినకాడికి దోచేసుకుంటున్నారని వైద్యసిబ్బంది సైతం చెబుతున్నారు. కొందరు వైద్యులు అవినీతికి పాల్పడుతున్నా, విధుల్లో అలసత్వం వహిస్తున్నా వైద్యారోగ్య శాఖ అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఇలాంటి అవినీతి ఎన్నడూ లేదని వైద్యసేవలన్నీ పారదర్శకంగా జరిగేవని రోగులు చెబుతున్నారు.
ప్రైవేటు ఆస్పత్రిలో
మందుల కొనుగోలు బిల్లు
వైద్య సిబ్బందికి రూ.500 ఫోన్ పే
నా భార్యకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించేందుకు ఆస్పత్రిలోని పీపీ యూనిట్ విభాగంలోని వైద్యురాలిని సంప్రదించగా సోమవారం శస్త్రచికిత్స చేస్తామని రమ్మన్నారు. వచ్చిన తరువాత వైద్యురాలు మందులు చీటీ రాసి ఆస్పత్రికి ఎదురుగా ఉన్న ప్రైవేటు ఆస్పత్రిలోని మందుల దుకాణంలోనే మందులు కొనాలని చెప్పారు. వైద్యురాలి పేరుతోనే ఉన్న విజిటింగ్ కార్డు ఇచ్చారు. శస్త్రచికిత్స అనంతరం వైద్యసిబ్బంది వచ్చి రూ.500 ఇమ్మంటే ఇచ్చాను. ఆ తరువాత ఆపరేషన్ సమయంలో మత్తు రెండోసారి ఇవ్వాల్సి వచ్చిందని.. మరో రూ. 500 ఇమ్మంటే వైద్యసిబ్బంది నెంబరుకు ఫోన్‌పే ద్వారా చెల్లించాను.
– అంజిబాబు, వేలివెన్ను, ఉండ్రాజవరం మండలం

పైసలిస్తేనే ఆపరేషన్లు

పైసలిస్తేనే ఆపరేషన్లు