
పరిశోధనలతో వైజ్ఞానిక పురోగతి
తాడేపల్లిగూడెం: దేశ ప్రగతిలో టెక్నాలజీ ఎంతో కీలకపాత్ర పోషిస్తుందని, పరిశోధనల జోరుతోనే వైజ్ఞానిక పురోగతి సాధ్యమని ఎఫ్ట్రానిక్స్ ప్రైవేటు లిమిటెడ్ సీఈఓ దాసరి రామకృష్ణ అన్నారు. ఏపీ నిట్ ఇండక్షన్ ప్రోగ్రాంను పురస్కరించుకొని సోమవారం నిట్ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. విద్యార్థులు సమాజం ఎదుర్కొంటున్న కఠిన సవాళ్లకు ధీటుగా సమాధానం చెప్పాలంటే నూతన ఆవిష్కరణలకు రూపకల్పన చేయాలన్నారు. ఇన్‌చార్జి డైరెక్టర్ డాక్టర్ ఎన్‌వీ రమణరావు మాట్లాడుతూ కృత్రిమ మేధ, మిషన్ లెర్నింగ్, రోబోటిక్స్ , ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, బ్లాక్ చైన్ వంటి కోర్సులపై పట్టు సాధించేలా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో డీన్ స్టూడెంట్ వెల్ఫేర్, అకడమిక్ కె.హిమబిందు, ఎన్.జయరాం, రిజిస్ట్రార్ దినేష్ శంకరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ముదినేపల్లి రూరల్: ఫుడ్‌సేఫ్టీ అధికారుల ఆదేశాలు, సూచనలు బేఖాతరు చేస్తూ ఆహారపదార్థాల తయారీలో అశ్రద్ధ వహిస్తున్నారు. స్థానిక బేకరీలో తయారు చేసిన కేక్‌లో బల్లి రావడమే ఇందుకు నిదర్శనం. స్థానికుడు బేకరీలో కేక్‌ను కొనుగోలు చేయగా అందులో బల్లి అవశేషాలున్నట్లు గుర్తించి నిలదీశాడు. దీనిపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫుడ్‌సేఫ్టీ అధికారుల ఉదాసీనతత వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని, వ్యాపారసంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.