
టీడీపీ నేతల అడ్డాగా ఫెర్రీ
● అనుమతులు లేకుండా అబ్బిరాజుపాలెం రేవులో పడవలపై రాకపోకలు
● మంత్రి అండతోనే నడుపుతున్నామంటున్న నాయకులు
● తెలిసినా పట్టించుకోని అధికారులు
యలమంచిలి: పశ్చిమ గోదావరి జిల్లా అబ్బిరాజుపాలెం, అంబేడ్కర్ కోనసీమ జిల్లా సోంపల్లి గ్రామాల మధ్య గోదావరిలో పడవ ప్రయాణానికి అనుమతి లేకపోయిన టీడీపీ నాయకులు దౌర్జన్యంగా పడవలు నడుపుతున్నారు. అనధికారికంగా పడవలు తిప్పుతూ కనీస వసతులు కల్పించడం లేదు. సోమవారం ఒక పడవపై పదుల సంఖ్యలో మోటార్ సైకిల్స్ వేసి పడవ నడిపారు. పడవలో ఉన్న వారికి కనీసం లైఫ్ జాకెట్స్ ఇవ్వలేదు. దీనిపై ఇద్దరు ప్రయాణికులు అడిగిన పాపానికి వారిపై టీడీపీ నాయకుడు విచక్షణా రహితంగా దాడి చేశాడు. లైఫ్ జాకెట్స్ ఉండవు.. చస్తామనే భయముంటే పడవ ఎక్కకండి అంటూ వారిపై విరుచుకుపడ్డాడు. దీంతో ఆ ఇద్దరి యువకులు రాజోలు పోలీస్, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
వరదకు ముందు నుంచే..
ఒకవైపు గోదావరిలో వరద.. మరో వైపు మరమ్మతుల పేరిట చించినాడ వంతెనపై రాకపోకలకు ఆంక్షలు. దీంతో అంబేడ్కర్ కోనసీమ జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో పడవ ప్రయాణాన్ని ఆశ్రయిస్తున్నారు. మండల పరిషత్ అధీనంలో ఉన్న దొడ్డిపట్ల ఫెర్రీకి మాత్రమే పంటు నడపడానికి అనుమతి ఉంది. పంచాయతీ అధీనంలో ఉన్న అబ్బిరాజుపాలెం ఫెర్రీకి రెండు నెలల క్రితమే ఫెర్రీ పాట గడువు ముగిసింది. ఇదే అదునుగా తెలుగుదేశం నాయకులు మంత్రి ద్వారా అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి పాట పెట్టకుండా అనధికారికంగా ఈ ఫెర్రీలో పడవలు నడుపుతున్నారు. కనీస రక్షణ లేకుండా అధిక లోడు వేసి నడపడంపై ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా పట్టించుకోవడం లేదు.
మంత్రి నడుపుకోమన్నారు
ఈ నెల 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జరిగిన గ్రామ సభలో సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులను గ్రామస్తులు ఫెర్రీ పాట పెట్టకుండా పడవలు ఎలా నడుపుతున్నారని ప్రశ్నించారు. రేవులో నడుపుతున్న పడవలకు పంచాయతీకి సంబంధం లేదని సర్పంచ్, గ్రామ కార్యదర్శి చెప్పగా, అక్కడే ఉన్న తెలుగుదేశం నాయకులు మంత్రి నిమ్మల రామానాయుడు నడపమని చెప్పడంతో మేమే నడుపుతున్నాం అని చెప్పారు. మంత్రి పేరు చెప్పడంతో మిగిలిన వారు మిన్నకుండిపోయారు. వరద సమయంలో కనీస రక్షణ చర్యలు లేకుండా, అనుమతి లేకుండా ఫెర్రీలో పడవలు నడుపుతున్నా పంచాయతీరాజ్, రెవెన్యూ, కన్సర్జెన్సీ అధికారులు పట్టించుకోకపోవడం వెనుక భారీగా ముడుపులు అందడమే కాకుండా మంత్రి ఒత్తిడి కూడా ఉందని గ్రామస్తులు గుసగుసలాడుతున్నారు.