
భారీ వర్షాలతో అప్రమత్తం
భీమవరం (ప్రకాశంచౌక్): భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. గంటకు 30–40 కి.మీ. వేగంతో తీరం వెంట ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని కలెక్టర్ సూచించారు. గోదావరికి వరద ఉధృతి దృష్ట్యా నదిలోకి వెళ్లవద్దని, ఈతకు వెళ్లడం, చేపలు పట్టడం వంటివి చేయవద్దన్నారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి ప్రాణ, ధన నష్టం జరగకుండా చూడాలని సూచించారు. వైద్య ఆరోగ్య శాఖ ద్వారా అత్యవసర మందులు, క్లోరిన్, బ్లీచింగ్ తదితర సామగ్రితో సిద్ధంగా ఉండాలన్నారు. వ్యవసాయ అధికారులు, ఇరిగేషన్ అధికారులు వర్షాలు తగ్గే వరకు జాగ్రత్తగా ఉండాలన్నారు. అత్యవసర సమయంలో వినియోగం నిమిత్తం మోటార్ బోట్లు, గత ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలన్నారు. అధికారులంతా ప్రధాన కేంద్రాల్లోనే ఉండాలని, ఎవరికీ సెలవులు లేవని చెప్పారు. కలెక్టరేట్‌లో 08816 299181 నెంబరుతో కంట్రోల్ రూం ఏర్పాటు చేశామన్నారు.