
మా పొట్ట కొట్టొద్దు
గళమెత్తిన ఆటో కార్మికులు
భీమవరం/తణుకు అర్బన్/తాడేపల్లిగూడెం (టీఓసీ)/పాలకోడేరు/అత్తిలి/పెనుమంట్ర/ఆకివీడు: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న ఉచిత బస్సు పథకంతో తాము జీవనోపాధి కోల్పోతామంటూ గురువారం జిల్లావ్యాప్తంగా ఆటో డ్రైవర్లు, కార్మికులు నిరసన తెలిపారు. బంద్‌లు, ధర్నాలతో ఆందోళన వ్యక్తం చేశారు. భీమవరంలో ఆటో వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు యింటి సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా సుమారు 6 లక్షల మంది, జిల్లాలో 16 వేల మంది ఆటోలనే ఆధారంగా జీవనం సాగిస్తున్నారన్నారు. వారంతా రోడ్డున పడతారన్నారు. తణుకులో రాష్ట్రపతి రోడ్డు, సొసైటీ రోడ్డు, వేల్పూరు రోడ్డు, ఉండ్రాజవరం రోడ్డుతోపాటు రైల్వేస్టేషన్ ప్రాంతంలోని ఆటో యూనియన్ల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతంలోని భారతమాత ఆటోయూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు పంగం రాంబాబు, కంచుమర్తి విశ్వేశ్వరరావు ఆధ్వర్యంలో ధర్నా చేశారు. తాడేపల్లిగూడెంలో సుమారు 22 యూనియన్ల నాయకులు, ఆటో డ్రైవర్లు టెంట్లు వేసి నిరసన తెలిపారు. పట్టణంలో 24 గంటల పాటు ఆటోలను నిలుపుదల చేశారు. పాలకోడేరులోని రావిచెట్టు సెంటర్ వద్ద మహాత్మా గాంధీ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. అత్తిలి బస్‌స్టేషన్ సెంటర్‌లో ఆటో కార్మికులు నిరసన తెలిపారు. పెనుమంట్ర మండలంలో ఆటో డ్రైవర్లు బంద్ పాటించి తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. ఆకివీడులో అంబేడ్కర్ ఆటో యూనియన్ నాయకులు నిరసన తెలిపారు. ఆటోలను నిలుపుదల చేసి బంద్ పాటించారు.

మా పొట్ట కొట్టొద్దు

మా పొట్ట కొట్టొద్దు