
జన్యు ఎడిటింగ్ ద్వారా కొత్త వంగడాల అభివృద్ధి
తాడేపల్లిగూడెం: జన్యు ఎడిటింగ్ పద్ధతి ద్వారా అధిక నిల్వ సామర్థ్యం, మెరుగైన నాణ్యతా ప్రమాణాలు కలిగిన పండ్లు, పువ్వులు, కూరగాయలకు సంబంధించి కొత్త వంగడాలను (జాతులను) అభివృద్ధి చేయవచ్చని పీజీపీఆర్ ఆసియా సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ ఎంఎస్ రెడ్డి చెప్పారు. డాక్టర్ వైఎస్‌ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో గురు వారం సంయుక్త ఆధ్వర్యంలో ‘అన్యదేశ పంటలు– హైబ్రిడ్, హరిత భవిష్యత్ కోసం ప్రపంచ వాణిజ్యం, సుస్థిర సాంకేతికతలు’ అనే అంశంపై అంతర్జాతీయ సదస్సు నిర్వహించారు. వర్సిటీ ఉపకులపతి డాక్టర్ కె.గోపాల్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సుకు ముఖ్య అతిఽథిగా విచ్చేసిన డాక్టర్ ఎంఎస్ రెడ్డి విదేశీ కూరగాయల సాగుతో ఇక్కడి రైతులు అధిక ఆదాయం పొందవచ్చని తెలిపారు. కార్యక్రమంలో ఉపకులపతి డాక్టర్ కె.గోపాల్ మాట్లాడుతూ అవకాడో, డ్రాగన్ ఫ్రూట్, రాంభూటాన్, అబ్లు, ఫ్యాషన్ ఫ్రూట్, ఫిగ్, మాంగోస్టీన్, లిచ్చి, దురైన్, స్టార్ ప్రూట్ వంటి విదేశీ పండ్లు, ఆర్బిడ్స్, డైసీ. డాఫోడిల్ , లోటస్, తులిప్, లిసియాంతుస్, హైబిస్కుస్, అమరిల్లస్, ఆడినియం, వంటి విదేశీ పుష్పాలు, బ్రకోలీ, చెర్రీటమాటో, పర్సేలీ, యూరోపియన్ క్యారోట్, క్యాప్సికం, రమనేస్కో కాలిఫోవర్, రాడిష్, ఓకా వంటి విదేశీ కూరగాయలు మన రాష్ట్రంలో సాగుచేస్తే రైతులు మంచి ఆదాయం పొందవచ్చన్నారు. ఇలా సాగు చేయడం ద్వారా దిగుమతులు తగ్గి విదేశీ మారకం నిలిచి ఉంటుందన్నారు. స్వర్ణాంధ్ర విజన్‌లో భాగంగా వ్యవసాయానికి , ఉద్యానానికి అఽధిక ప్రాధాన్యత ఇవ్వనున్నారన్నారు. ఈ క్రమంలో అన్యదేశ పంటలను ప్రోత్సహించేందుకు పీజీపీఆర్ ఆసియా సొసైటీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు. ఈ సదస్సులో వర్చువల్‌గా వియత్నాం ప్రొఫెసర్ నోగ్యన్ థాయ్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ ఫామ్ రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ కె.సురేష్, జాతీయ ఉద్యానపరిశోధనా స్థానం కో–ఆర్డినేటర్ డాక్టర్ ప్రకాష్ పాటిల్ తమ అభిప్రాయాలను తెలిపారు. జీవవైవిధ్యం, ఆహార భద్రతను పెంపొందించడానికి అన్యదేశ పంటలు అనే విషయంపై ఐఐహెచ్‌ఆర్ సైంటిస్టు జి.కరుణాకరన్ మాట్లాడారు. పీజీపీఆర్‌తో ఒప్పందం వల్ల ఉద్యానవర్సిటీ శాస్త్రవేత్తలకు, పరిశోధన చేసే విద్యార్థులకు విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం చేయాలనుకునే విద్యార్థులకు సాంకేతిక సహకారం, ఆసియా సొసైటీ అందిస్తుందని వీసీ గోపాల్ తెలిపారు. ఈ ఒప్పందంతో కలిపి ఇప్పటి వరకు 82 ఒప్పందాలు చేసుకున్నామని సదస్సు కన్వీనర్, డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీయల్, ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్ కె.ధనుంజయరావు చెప్పారు. గురువారంతో ఈ సదస్సు ముగిసిందని పేర్కొన్నారు.
డాక్టర్ ఎంఎస్ రెడ్డి సూచన