దిగుబడి తగ్గినా జిల్లాలో పత్తి, మొక్కజొన్నకు మంచి రేట్లు
ఖిలా వరంగల్: జిల్లాలో మొక్కజొన్న, పత్తి పంటలు సాగుచేసిన రైతులకు ఈ ఖరీఫ్ సీజన్ కలిసిరాలేదు. ఎల్‌నినో ప్రభావంతో తీవ్రంగా వర్షాభావ పరిస్థితులు ఏర్పడి పంటలు ఆశాజనకంగా లేవు. ఉష్ణోగ్రతలు నిత్యం 35 డిగ్రీల వరకు నమోదవుతుండడం గమనార్హం. దీంతో చాలా చోట్ల పత్తి పంటలో సరైన ఎదుగుదల లేదు. కొద్దిపాటి కాయలు కాసినా ఎండకు పాడవుతున్నాయి. ఎకరాకు రెండు క్వింటాళ్ల దిగుబడి కూడా కష్టమేనని, పెట్టుబడి కోసం చేసిన ఆప్పులు ఈసారి తీర్చే పరిస్థితి లేదని రైతులు వేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే, కొద్దిపాటి పంటలకు ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర కంటే మార్కెట్‌లో ఎక్కువ ధర పలికి రైతులకు కలిసివస్తోంది.
మొక్కజొన్నకు ప్రైవేట్‌లో మంచి ధర..
సాధారణంగా మొక్కజొన్న ఎకరాకు 25 క్వింటాళ్లకు పైగా దిగుబడి వచ్చేది. ఈసారి 10 క్వింటాళ్లు వచ్చే పరిస్థితి కూడా లేదు. ఉన్న కొద్దిపాటి పంటకు ప్రైవేట్‌లో మద్దతుకు మించి ధరలు పలుకుతున్నాయి. గతేడాది మొక్కజొన్న మద్దతు ధర క్వింటాకు రూ.2.410 ఉండగా.. ఈసారి ప్రభుత్వం రూ.2,465 స్వల్పంగా పెంచింది. గురువారం వరంగల్ వ్యవసాయ మార్కెట్‌లో క్వింటాలుకు రూ.2,810 నుంచి 2,895 వరకు ధర పలికింది. దీంతో ప్రైవేట్ వ్యాపారులు నేరుగా పొలాల వద్దకు వచ్చి గింజల తేమ శాతం, నాణ్యతను బట్టి నిర్ణయించి తూకం వేసుకుని రైతులకు డబ్బులు చెల్లిస్తున్నారు. జిల్లాలో 18,966 ఎకరాల్లో మొక్కజొన్న సాగవుతోంది.
భారీగా తగ్గిన పత్తి దిగుబడి
జిల్లాలోని రాయపర్తి, వర్ధన్నపేట, పర్వతగిరి, సంగెం, నెక్కొండ, చెన్నారావుపేట, గీసుకొండ, నల్లబెల్లి మండలాల్లో ఖరీఫ్‌లో ప్రధాన పంటగా ఎక్కువగా పత్తి సాగు చేస్తున్నారు. గతేడాది సీసీఐ ద్వారా క్వింటాలుకు రూ.8,150గా చెల్లించారు. ఈసారి సాగుకు ముందే అన్ని పంటలకు మద్దతు ధర పెంచి, క్వింటాలుకు రూ.8,667గా ప్రకటించింది. కానీ, ఈసారి దిగుబడులు లేక బహిరంగ మార్కెట్లలో 9,060 ధర పలుకుతోంది. సాధారణంగా ఎకరానికి 10 క్వింటాళ్ల నుంచి 12 క్వింటాళ్ల వరకు దిగుబడి రావాలి. వర్షాభావంతో ఎకరాకు 2 క్వింటాళ్లు కూడా రావడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో 1,12,044 ఎకరాల విస్తీర్ణంలో పత్తి సాగవుతోంది.
చెన్నారావుపేట మండలం లింగగిరి గ్రామానికి చెందిన రైతు కొల్లూరి రాజు మూడు ఎకరాల్లో పత్తి సాగు చేశాడు. గత ఏడాది ఎకరాకు 12 క్వింటాళ్ల దిగబడి వచ్చింది. ఈసారి పూత, కాత దశలోనే పంట దెబ్బతిన్నది. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక పత్తి దిగుబడి తగ్గింది. ప్రస్తుతం మూడు క్వింటాళ్ల పత్తి మార్కెట్‌లో విక్రయించగా ఆశించిన దానికంటే ఎక్కువ ధర పలికింది.
చెన్నారావుపేట మండలం అమీనాబాద్ గ్రామానికి చెందిన రైతు వీరూ రెండు ఎకరాల్లో మొక్కజొన్న పంట వేశాడు. వానలు బాగా కురిస్తే ఎకరాకు 20 నుంచి 25 క్వింటాళ్ల దిగుబడి వచ్చేది. వర్షాలు లేక కంకులు పెరగలేదు. గింజలకు సరిగా పాలుపట్టక బలహీనంగా ఉన్నాయి. కంకులు చిన్నగా ఉండడంతో రెండెకరాల్లో మొక్కజొన్న 16 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చింది.
వర్షాభావ పరిస్థితులతో
ఆశాజనకంగా లేని పంటలు
1,12,044 ఎకరాల్లో కాటన్ 18,966 ఎకరాల విస్తీర్ణంలో మక్కల సాగు
ఎకరాకు రెండు క్వింటాళ్లే..
వానాకాలంలో రెండు ఎకరాల్లో పత్తి పంట సాగు చేశాను. పెట్టుబడికి రూ.75 వేల ఖర్చయ్యింది. ఇటీవల ఎకరాకు రెండు క్వింటాళ్ల పత్తి వచ్చింది. మరో 15 హేను రోజుల్లో దీపావళి వరకు ఇంకో రెండు క్వింటాళ్ల పత్తి వచ్చే అవకాశం ఉంది. ఎల్‌నినో ప్రభావంతో దిగుబడి తగ్గింది. వర్షాభావ పరిస్థితుల్లో ప్రభుత్వం రైతును అందుకోవాలి.
˘& ---ç³#Í Æ>Ð]l¬-Ë$, Í…VýS-WÇ, ^ðl¯é²-Æ>Ð]l#-õ³r
మక్కలకు రికార్డు ధర
ఏనుమాముల మార్కెట్‌లో మొక్కజొన్నకు గురువారం రికార్డు ధర పలికింది. రాయపర్తి మండలం కుమ్మరిపల్లెకు చెందిన రైతు చెక్క రవి 42 బస్తాల మక్కలను మార్కెట్‌కు తీసుకురాగా.. ఓ వ్యాపారి క్వింటాలుకు రూ.2,895 చొప్పున కొనుగోలు చేశాడు. ఈ సీజన్‌లో మక్కలకు ఈస్థాయి ధర లభించడం మొదటిసారని మార్కెట్ చైర్‌పర్సన్ ఎర్ర ప్రియాంక, కార్యదర్శి శ్రీనివాస్ తెలిపారు.
– రవి, రైతు


