సంగెం: బ్యాంకింగ్ సేవలను సద్వినియోగం చేసుకుంటూ ఆర్థిక భద్రతను పెంపొందించుకోవాలని యూనియన్ బ్యాంకు వరంగల్ రీజనల్ హెడ్ సర్వేశ్ సూచించారు. యూనియన్ బ్యాంకు సంగెం బ్రాంచ్ ఆధ్వర్యంలో బ్యాంకు పథకాల ప్రయోజనాలపై కాట్రపల్లిలో గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అందించే సురక్ష బీమా, జీవనజ్యోతి బీమా వంటి సామాజిక భద్రతా పథకాలను ఖాతాదారులందరు ఉపయోగించుకోవాలని కోరారు. బ్యాంకులో తీసుకున్న రుణాన్ని సకాలంలో చెల్లించాలన్నారు. బ్యాంకుల నుంచి ఓటీపీలు ఎట్టి పరిస్థితుల్లో అడగరని, సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా సైబర్ నేరాల వల్ల డబ్బు పోగొట్టుకుంటే వెంటనే 1930 టోల్‌ఫ్రీ నంబర్‌కు పిర్యాదు చేయాలని సూచించారు. ఖాతాదారులు తమ నామిని వివరాలను అప్‌డేట్ చేసుకోవాలన్నారు. గోల్డ్‌లోన్, క్రాప్‌లోన్, సైబర్ మోసాలను గురించి వివరించారు. అనంతరం బ్యాంకు సేవల వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. సదస్సులో సర్పంచ్ వర్కాల శ్రావణి, మండల సమాఖ్య అధ్యక్షురాలు గాయపు ఉమాదేవి, యూనియన్ లీడ్ బ్యాంకు జిల్లా మేనేజర్ జీవన్‌కుమార్, సంగెం బ్రాంచ్ మేనేజర్ చందు, లీడ్ బ్యాంకు ఎఫ్‌ఎల్‌సీ భాస్కరాచారి తదితరులు పాల్గొన్నారు.
యూనియన్ బ్యాంకు
వరంగల్ రీజనల్ హెడ్ సర్వేశ్


