రైల్వే ఓహెచ్‌ఈ పోల్‌ ఎక్కిన యువకుడు | - | Sakshi
Sakshi News home page

రైల్వే ఓహెచ్‌ఈ పోల్‌ ఎక్కిన యువకుడు

Oct 22 2026 1:21 AM | Updated on Oct 22 2026 1:21 AM

ఘనంగా త్రిశూల తీర్థోత్సవం శోభాయమానం భద్రకాళీ భద్రేశ్వరుల కల్యాణోత్సవం

● కుటుంబ సమస్యలే కారణం

నెక్కొండ: తాగిన మత్తులో ఓ యువకుడు వరంగల్‌ జిల్లా నెక్కొండ రైల్వే స్టేషన్‌లో హల్‌చల్‌ చేసిన సంఘటన బుధవారం రాత్రి జరిగింది. ఎస్సై శ్రవణ్‌కుమార్‌, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్‌ జిల్లాకు చెందిన 39 సంవత్సరాల సుల్తాన్‌ జబైరీ నెక్కొండలో తాపీ పనులకు వచ్చాడు. తన భార్య కాపురానికి రావడంలేదని మనస్తాపానికి గురైన ఆయన తాగిన మైకంలో రైల్వే ఓవర్‌ హెడ్‌ ఎలక్ట్రికల్‌ (ఓహెచ్‌ఈ) పోల్‌ ఎక్కాడు. స్థానికులు ఫొటోలు, వీడియోలు తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా వైరలైంది. దీంతో స్థానిక పోలీసులు సంఘటనా స్థలికి చేరుకొని యువకుడిని కిందికి దింపే ప్రయత్నం చేశారు. దిగేందుకు ససేమిరా అనడంతో కొందరు సాహసం చేసి పోల్‌ ఎక్కి యువకుడిని కిందికి దింపారు. సుల్తాన్‌ జబైరీని రైల్వే పోలీసులకు అప్పగించినట్లు ఎస్సై తెలిపారు.

హన్మకొండ కల్చరల్‌: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీరుద్రేశ్వరస్వామివారి వేయిస్తంభాల దేవాలయంలోని ప్రాచీన కోనేటిలో త్రిశూల తీర్థోత్సవం (త్రిశూల స్నానం) మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో అర్చకులు మణికంఠశర్మ, ప్రణవ్‌, దత్తకుమార్‌శర్మ శ్రీరుద్రేశ్వరస్వామి వారికి రుద్రాభిషేకం చేశారు. అమ్మవారి ఉత్సవ విగ్రహానికి చతుషష్టి ఉపచారపూజలు, అపరాజితాదేవిపూజ, శమీపూజ చేసి రాజరాజేశ్వరీదేవిగా అలంకరించారు. గంగు ఉపేంద్రశర్మ శ్రీరుద్రేశ్వరి అమ్మవారి పంచలోహ విగ్రహాన్ని, త్రిశూలాన్ని పసుపుతో పూజించారు. అనంతరం పల్లకీలో ఊరేగింపుగా తీసుకెళ్లి ఆలయంలోని ప్రాచీన కోనేరు జలంలో శ్రీసూక్తవిధానంతో అవబృధస్నానం, జలాధివాసం, త్రిశూల తీర్థోత్సవం నిర్వహించారు. శ్రీరుద్రేశ్వరీదేవి ఉత్సవమూర్తిని తిరిగి దేవాలయంలో రుద్రేశ్వరుడి సన్నిధిలో ప్రతిష్టించారు. త్రిశూల స్నానంలో వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, దేవర విష్ణువర్ధన్‌రెడ్డి, ఉత్సవ సమితి సభ్యుతలు పల్లం రమేశ్‌, కోన శ్రీకర్‌ తదితరులు పాల్గొన్నారు. సాయంత్రం భక్తులకు చిత్రాన్న ప్రసాద వితరణ, జమ్మి పత్రాలను అందజేశారు. ఆలయ ఈఓ అనిల్‌కుమార్‌ పర్యవేక్షించారు.

హన్మకొండ కల్చరల్‌: దేశీ శరన్నవరాత్రోత్సవాల ముగింపులో భాగంగా బుధవారం శ్రీభద్రకాళి భద్రేశ్వరుల కల్యాణోత్సవం శోభాయమానంగా నిర్వహించారు. ఉదయం 4 గంటల నుంచి ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో అర్చకులు నిత్నాహికం, శతఘటాభిషేకం నిర్వహించారు. రాత్రి 8 గంటలకు శోభాయమానంగా అలంకరించి వేదికపై భద్రకాళీభద్రేశ్వరస్వామి ఉత్సవమూర్తులను ప్రతిష్ఠించారు. వివాహమహోత్సవాన్ని పురస్కరించుకుని భద్రేశ్వరస్వామికి ద్వితీయ స్వర్ణ యజ్ఞోపవీతాన్ని సమర్పించారు. అనంతరం వరపూజ, మధుపర్కవిధి, కాల్లు కడిగి కన్యాదానం చేయడం, మహాసంకల్పం మంగళాష్టకముల చూర్ణిక తదితర వివాహతంతు నిర్వహించారు. వధూవరులకు జీలకర్రబెల్లం పెట్టడం, మాంగళ్యధారణ తదితర విధులను శాస్త్రోక్తంగా జరిపారు. అనంతరం పుష్పయాగం నిర్వహించారు. ఆలయ ఈఓ సునీత ఏర్పాట్లను పర్యవేక్షించారు.

ఉత్సవాల ధ్వజావరోహణం

మంగళవారం విజయదశమిని పురస్కరించుకుని అమ్మవారికి నిత్యాహ్నికం, ఉత్సవాల ద్వజావరోహణం చేశారు. కలశోద్వాసన సామ్రాజ్యపట్టాభిషేకం జరిపి, చక్రతీర్థోత్సవం, శమీపూజ జరిపారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, సీపీ శ్వేత, కుడా చైర్‌పర్సన్‌ గుండు సుధారాణి, శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌ డాక్టర్‌ బండా ప్రకాశ్‌, దేవాలయ స్థపతి వల్లినాయగం అమ్మవారిని దర్శించుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement