తహసీల్దార్‌దా ? మైనింగ్ శాఖదా?
ఐనవోలు: కొండపర్తి గ్రామంలో సర్వేనంబర్ 1279/2లోని అసైన్డ్ భూమిలో మట్టి తరలింపు వ్యవహారంపై ‘22–ఏ నిషేధిత భూమికి మైనింగ్‌కు అనుమతి’ శీర్షికన ‘సాక్షి’లో బుధవారం ప్రచురితమైన కథనంతో అధికార యంత్రాంగంలో కదలిక వచ్చింది. సంబంధిత భూమి మైనింగ్ కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. 22–ఏ భూమికి మైనింగ్ పర్మిట్ ఇవ్వడంలో ‘తప్పు నాది కాదంటే నాది కాదు’ అని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై తహసీల్దార్‌ను వివరణ కోరితే ఇది నా పరిధిలోకి రాదు.. ఈడీ మైనింగ్‌ను అడగాలని చెబుతున్నారు. మరోవైపు మైనింగ్ శాఖ అధికారులు మాత్రం తహసీల్దార్‌నుంచి ఎన్‌ఓసీ, సంబంధిత ధృవీకరణలు వచ్చినందునే అనుమతి ఇచ్చామని చెబుతున్నట్లు సమాచారం. భూమి వివరాలను నిర్ధారించాల్సిన రెవెన్యూ శాఖ, ఆ వివరాల ఆధారంగా మైనింగ్ అనుమతి ఇచ్చిన మైనింగ్ శాఖల అధికార పరిధిని జిల్లా కలెక్టర్ స్పష్టం చేయాలని కొండపర్తి గ్రామస్తులు కోరుతున్నారు. అన్ని ప్రక్రియలు నిబంధనల ప్రకారం పూర్తయ్యాయని అధికారులు చెబుతున్నారని, కథనం వెలువడిన వెంటనే మైనింగ్ కార్యకలాపాలు నిలిచిపోవడానికి కారణమేంటో వారే చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
మరో కొత్తకోణం..
అనుమతుల విషయంలో మరో కొత్తకోణం వెలుగుచూసింది. మండలంలోని కొండపర్తి కాకుండా మరో గ్రామానికి చెందిన వ్యక్తి జూలై 4న 1279/6లో మైనింగ్‌కు పర్మిషన్ ఇవ్వాలని మైనింగ్ శాఖను కోరినట్లు తెలుస్తోంది. మైనింగ్ శాఖ తహసీల్దార్‌ను భూ విస్తీర్ణం, ల్యాండ్ క్లాసిఫికేషన్, మైనింగ్ వల్ల ఇంటి స్థలాలు, వ్యవసాయ భూములకు ఎఫెక్ట్ అవుతుందా తదితర అంశాలతో నివేదిక ఇవ్వాలని కోరారు. ఈ మేరకు తహసీల్దార్ 1279/6 స్కెచ్ లొకేషన్ మ్యాప్, అందుకు సంబంధించిన నివేదిక పంపించినట్లు సమాచారం. దరఖాస్తులో 1279/6 ఉన్నప్పుడు 1279/2 ఎలా వచ్చింది? ఈ మార్పు ఎక్కడ జరిగింది.. రెండు శాఖల అధికారులు తమ వద్ద రికార్డులను బహిర్గతం చేసి ఎలాంటి ఆమ్యామ్యాలకు, ఒత్తిళ్లకు లొంగలేదని స్పష్టత ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు. క్షేత్రస్ధాయి పర్యటన లేకుండా ఇష్టారీతిన మైనింగ్ శాఖ అనుమతులు ఇచ్చుకుంటే పోతే సహజవనరులను దోచుకుంటారని గ్రామ సర్పంచ్‌తోపాటు ప్రజలు మండిపడుతున్నారు. ఈ ఒక్క విషయంలోనే కాకుండా మండలంలో మరోచోట కూడా మైనింగ్ శాఖ పరోక్షంగా బడానేతలకు సహకరిస్తుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కలెక్టర్ ఇప్పటికై నా స్పందించి మైనింగ్ అనుమతుల విషయంలో రెవెన్యూ, పోలీస్, వ్యవసాయ, ఇరిగేషన్, సంబంధిత గ్రామ పంచాయతీ, ఆర్‌అండ్‌బీ శాఖల ఎన్‌ఓసీ తప్పనిసరి చేసి కఠినంగా వ్యవహరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
తప్పించుకునే ప్రయత్నంలో
అధికారులు..
కలెక్టర్ స్పందించి విచారణ చేపట్టాలని కొండపర్తి గ్రామస్తుల విజ్ఞప్తి


