సాక్షి, వరంగల్: ‘హాస్టళ్లలో ఆకలి కేకలు!’ శీర్షికతో ‘సాక్షి’ దినపత్రికలో మంగళవారం ప్రచురితమైన కథనానికి జిల్లా యంత్రాంగం, గిరిజన సంక్షేమ శాఖ తక్షణమే స్పందించాయి. హాస్టళ్లలో మెనూ ప్రకారం ఆహారం అందడంలో ఇబ్బందులు తలెత్తకుండా భవిష్యత్‌లో గట్టి చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. పాత కాంట్రాక్టు గడువు ముగిసి, కొత్త టెండర్ ప్రక్రియ జరుగుతున్న సమయంలో కొన్నిచోట్ల సరుకుల ఇండెంట్‌లో స్వల్ప జాప్యం జరిగిన మాట వాస్తవమేనని, అయితే పత్రికలో వచ్చిన కథనంతో వెంటనే స్పందించి తక్షణ చర్యలు తీసుకున్నామన్నారు. వసతి గృహ సంక్షేమ అధికారులు అప్పులు చేయాల్సిన అవసరం లేకుండా తక్షణమే నిధులు విడుదల చేస్తున్నామన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు డీటీడీఓ ఆధ్వర్యంలో జిల్లాస్థాయిలో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి ప్రతిరోజూ టిఫిన్, భోజనానికి సంబంధించిన ఫొటోలను పంపుతూ పర్యవేక్షిస్తున్నామన్నారు. ఇప్పటికే గురుకులాలకు, హాస్టళ్లకు ఆయా తేదీల్లో జీసీసీ ద్వారా నిరంతరంగా సరుకులు సరఫరా చేశామని, భవిష్యత్‌లో విద్యార్థులకు ఎలాంటి కొరత లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని వెల్లడించారు.
‘హాస్టళ్లలో ఆకలి కేకలు’ పై
స్పందించిన జిల్లా యంత్రాంగం
కొత్త మార్గదర్శకాలతో
సరుకుల సరఫరా క్రమబద్ధీకరణ
వాట్సాప్ గ్రూపుల ద్వారా
కలెక్టర్ పర్యవేక్షణ


